రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి పౌర హక్కు, సమానత్వం, జీవించే హక్కులు కల్పించబడ్డాయి

నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రాజేష్ బాబు
నాగర్ కర్నూలు జిల్లా బ్యూరో డిసెంబర్ 1 జనం సాక్షి:
పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలందరికీ న్యాయ సేవలు అందించడమే న్యాయ సేవాధికార సంస్థ లక్ష్యమని నాగర్ కర్నూలు జిల్లా సెషన్స్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ డి. రాజేష్ బాబు అన్నారు.
గురువారం తెలకపల్లి మండలంలోని రాకొండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో జిల్లా కోర్టు ఆధ్వర్యంలో న్యాయ సదస్సు నిర్వహించారు.
సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రాజేష్ బాబు మాట్లాడుతూ…..
రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి పౌర హక్కు, సమానత్వం, జీవించే హక్కు ఉన్నాయని అన్నారు.
 హక్కులకు భంగం కలిగినప్పుడు పేద ప్రజలు మహిళలు, జిల్లా లేదా మండల న్యాయసేవాధికార సంస్థలను ఆశ్రయించి సహాయం పొందాలని అన్నారు.
ఇప్పుడు న్యాయ సేవలు ప్రజల ముంగిటకే వచ్చాయని వాటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
గ్రామాలకు బృందాలుగా వెళ్లి ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించామని తెలిపారు.
 ఆస్తి, భూ తగాదాల కు సంబంధించి కేసులకు చాలా మంది ఆర్థిక స్థోమత లేకపోయినప్పటికి అప్పులు చేసి న్యాయవాదిని ఏర్పాటు చేసుకుంటున్నారని అన్నారు.
ఉచిత న్యాయ సహాయం గురించి అవగాహన లేకపోవడం,తెలియక పోవడం వల్లనే ఆర్ధిక భారం పడుతుందని, క్రిమినల్,సివిల్ కేసుల్లో కూడా జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ ద్వారానే న్యాయవాదికి ఫీజు చెల్లించి ఉచిత న్యాయ సహాయం అందిస్తామని అన్నారు.
ఇప్పుడు జిల్లా న్యాయస్థానం పూర్తిగా నాగర్ కర్నూలు లోనే ఏర్పడిందన్నారు.
ప్రజలకు సత్వర న్యాయమందించేందుకు అవకాశాలు ఏర్పడ్డాయి అన్నారు.
 రైతులు భూములు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా పత్రాలను పరిశీలించుకొని బాండ్ పేపర్ రాయించుకోవాలన్నారు.
రైతులు ఎవరు కూడా రోడ్లపై విత్తనాలను ఆరబెట్టుకోకూడదన్నారు.
ఇతరులకు ఇబ్బంది కలిగించే ఏ అంశమైనా అది నేరమే  అవుతుందన్నారు.
రోడ్లపై వరి ఇతర ధాన్యాలు వేయడం వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయన్నారు.
రైతులు విజ్ఞతతో ఆలోచించి ప్రభుత్వం అందించే సహకారంతో రైతు కల్లాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
న్యాయం ముందు అందరూ సమానులే అన్నారు.
పురుగు మందులు, విత్తనాల కొనుగోలు విషయంలో జాగ్రత్త వహించాలని అన్నారు.
రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి  మౌనిక మాట్లాడుతూ….
పురుషులతో పాటు  మహిళలకు సమాన హక్కులు ఉన్నాయని,  ఇది భారత రాజ్యాంగం కల్పించిందని,
మహిళలందరూ చట్టాలపై అవగాహన పెంపొందించు కోవాలని,  ప్రజల ముంగిటకే న్యాయ సేవలు  అందుబాటులోకి వచ్చాయని వీటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
ఈ న్యాయ సదస్సులో పాల్గొన్న జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గుప్తా, న్యాయవాదులు రాజశేఖర్, హర్షవర్ధన్ రావు, శ్యాం ప్రసాద్, రాంబాబు, హమీద్ అలీ, ఎంపిటిసి శివకుమార్ రెడ్డి, ఎస్సై ప్రదీప్ కుమార్, కోర్టు సిబ్బంది కేశవరెడ్డి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.