రాజ్యాంగం మార్చాలని బీజేపీ కుట్ర

` క్విట్‌ బీజేపీ నినాదంతో ముందుకు వెళ్లాల్సిందే
` ఏఐసీసీ ఆదేశాల మేరకే జనహిత పాదయాత్ర
` పాదయాత్రకు పెద్దఎత్తున స్పందన
` బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం
` గాంధీభవన్‌ క్వింట్‌ఇండియా కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌
హైదరాబాద్‌(జనంసాక్షి): రాజ్యాంగం మార్చాలని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపి చర్యలన్నీ ఈ కోవలో భాగంగానే సాగుతున్నాయని అన్నారు. శనివారం గాంధీభవన్‌లో క్విట్‌ ఇండియా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ జెండా ఎగరవేశారు. క్విట్‌ బిజెపి నినాదంతోనే దేశానికి రక్ష అన్నారు. అలాగే.. ఎలక్షన్‌ కమిషన్‌పై ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ప్రదర్శించారు. ఈ సమావేశంలో టీ-పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడారు. రాష్ట్ర, దేశ ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య ఉద్యమం ఏ విధంగా జరిగిందో నేటి యువత తెలుసుకోవాలని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ సూచించారు. 1942లో బ్రిటీ-ష్‌ పాలకులను తరిమి కొట్టాలని అనేక ఉద్యమాలు జరిగినప్పటికీ క్విట్‌ ఇండియా ఉద్యమం కీలకమైనదని ఉద్ఘాటించారు. డూ ఆర్‌ డై నినాదంతో మహాత్మా గాంధీ క్విట్‌ ఇండియా ఉద్యమం చేశారని కొనియాడారు. నేడు అధికారంలో ఉన్న బీజేపీ.. కాంగ్రెస్‌ చరిత్రను తుడిచివేయాలని చూస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌.. నెహ్రూ, సర్దార్‌, సుభాష్‌ చంద్రబోస్‌ లాంటి నేతలను చరిత్రలో లేకుండా చేద్దామని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. స్వతంత్ర సంస్థలను వాడుకొని ప్రతిపక్షాలపై మోదీ ప్రభుత్వం కుట్ర పూరిత దాడి చేస్తోందని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ మండిపడ్డారు. ఎలక్షన్‌ కమిషన్‌.. బీజేపీ ఫ్రంటల్‌ ఆర్గనేషన్‌గా మారిందని ఆక్షేపించారు. ప్రశ్నిస్తే దేశ ద్రోహుల ముద్ర వేస్తున్నారని దుయ్యబట్టారు. క్విట్‌ బీజేపీ అంటేనే దేశానికి భవిష్యత్తు అని ఉద్ఘాటించారు. కులాలు, మతాల పేరిట బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకు భవిష్యత్తు లేకుండా చేస్తోందని విమర్శించారు. దేశ స్వాతంత్య ఉద్యమంలో ఒక్కరంటే ఒక్కరూ కూడా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు లేరని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ దేశ స్వాతంత్య కోసం ఉద్యమం చేసిందని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ ఈ దేశ రక్షణ కోసం పని చేస్తోందని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ పేర్కొన్నారు.
ఏఐసీసీ ఆదేశాల మేరకే జనహిత పాదయాత్ర
ఏఐసీసీ ఆదేశాల మేరకే జనహిత పాదయాత్ర చేస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తెలిపారు. ఈ పాదయాత్రకు పెద్దఎత్తున స్పందన వచ్చిందన్నారు. ప్రజలు కూడా నేరుగా వచ్చి కలుస్తున్నారని అన్నారు. గాంధీభవన్‌లో విూడియాతో చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. ప్రతినెల కొన్ని నియోజకవర్గాల్లో జనహిత పాదయాత్ర చేస్తానన్నారు. ఈ నెల చివరి వారంలో దీనికి రెండో దశ ఉంటుందని పేర్కొన్నారు. అనివార్య కారణాల వల్ల దిల్లీ ధర్నాకు ఖర్గే, రాహుల్‌ గాంధీ రాలేకపోయారని తెలిపారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై ఏఐసీసీ పరిశీలన చేస్తోంది. కొండా మురళి వ్యవహారం త్వరలో ముగిసిపోతుంది. అనిరుద్‌రెడ్డికి షోకాజ్‌ నోటీసు ఇచ్చారు.. వివరణ కూడా తీసుకున్నాం. బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. బీసీల కోరిక న్యాయబద్ధమైనది. ప్రతిపక్షాలు లేనిపోని విమర్శలు చేస్తున్నాయి. భాజపా మిత్రపక్షాలపై 3.5 శాతం మాత్రమే ఈడీ కేసులున్నాయి. మిగిలిన 96.5 శాతం విపక్షాలపైనే ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా జేబులో పెట్టుకొని తిరుగుతోంది. అవినీతి అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం పద్ధతి ప్రకారం ముందుకు పోతుంది. కాళేశ్వరం, ఫోన్‌ ట్యాపింగ్‌పై సమగ్రంగా చర్చించి ముందకు వెళ్తాం. బండి సంజయ్‌ ఆరోపణలు అర్థరహితంగా ఉన్నాయని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. రిజర్వేషన్లపై బీజేపీ నేతలు వితండవాదం చేస్తున్నారని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీఆర్‌ఎస్‌ శిఖండి పాత్ర పోషిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి చిత్తశుద్ది ఉంటే ఢల్లీిలో ధర్నాలో బీఆర్‌ఎస్‌ ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు.ధర్నాలో పాల్గొనకపోగా అవహేళన చేసి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌కు తెలంగాణ ప్రజలు గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు. బీసీ జనాభా లెక్కలు తెలుసుకునేందుకే కులగణన చేసినట్లు- తెలిపారు. ఆ తరువాతే.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించామన్నారు. రాహుల్‌ గాంధీ హావిూ మేరకు బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నామని స్పష్టం చేశారు. బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో..42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని రెండు బిల్లులు తీసుకొచ్చామని పేర్కొన్నారు. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని చట్టం చేసిందని, చేసిన చట్టాన్ని అధిగమించేందుకే ఆర్డినెన్స్‌ తీసుకొచ్చినట్లు- చెప్పారు. 4 నెలలు గడుస్తున్నా బిల్లులను రాష్ట్రపతి ఆమోదించలేదని అసహనం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం క్షేత్రస్థాయిలో అన్ని ప్రయత్నాలు చేసినట్లు- తెలిపారు. శాసనసభలో ఏకగ్రీవ ఆమోదంతోనే చట్టాలను ఢల్లీికి పంపామని పేర్కొన్నారు. కులగణన మోడల్‌ను రాహుల్‌, ఖర్గే ప్రశంసించారని హర్షం వ్యక్తం చేశారు. ధర్నాకు రాహుల్‌, ఖర్గే రాకపోవడంపై గల్లీ లీడర్లలా కిషన్‌రెడ్డి మాట్లాడటం సరికాదన్నారు.

రిజర్వేషన్లపై కావాలనే బీజేపీ రాద్ధాంతం
` హైకోర్టు ఆదేశాలకనుగుణంగా స్థానిక ఎన్నికలు
` పొన్నం ప్రభాకర్‌
హైదరాబాద్‌(జనంసాక్షి):బీసీల రిజర్వేషన్లపై బీజేపీ పార్టీ కావాలనే రాద్ధాంతం చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే స్థానిక ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని తమ ప్రభుత్వం ఎక్కడా పేర్కొనలేదని స్పష్టంచేశారు. రాష్ట్ర అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లు పెట్టినప్పుడు బీజేపీ నేతలు మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు కావాలనే బీజేపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. రాష్ట్ర, దేశ ప్రజలకు రాఖీ పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. శనివారం మినిస్టర్‌ క్వార్టర్స్‌లో వారి సోదరులకు మంత్రి సీతక్క రాఖీ కట్టారు. ఈ సందర్భంగా సీతక్కకు మంత్రి పొన్నం చీరను బహూకరించారు. సీతక్క నుంచి పొన్నం ప్రభాకర్‌ ఆశీర్వాదం తీసుకున్నారు. సీతక్కకు పొన్నం ప్రభాకర్‌ సోదరులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, రాఖీ పర్వదినం సందర్భంగా జూబ్లీహిల్స్‌ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మంత్రులు సీతక్క, కొండా సురేఖ రాఖీ కట్టారు. మినిస్టర్‌ క్వార్టర్స్‌లో అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌కి మంత్రి సీతక్క రాఖీ కట్టారు. సోదరి సీతక్క అంటూ ఆత్మీయంగా పలకరించి ప్రసాద్‌ కృతజ్ఞతలు తెలిపారు బంజారాహిల్స్‌ మినిస్టర్‌ క్వార్టర్స్‌లో మంత్రి శ్రీధర్‌ బాబుకి మంథని నియోజకవర్గ మహిళలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.