రాజ్యాంగ పరిరక్షణే గవర్నర్ విధి
– తమిళనాడు గవర్నర్ రోశయ్య
వేములవాడ, ఫిబ్రవరి 24 (జనంసాక్షి) :
రాజ్యాంగాన్ని పరిరక్షించడమే గవర్నర్ కర్తవ్యమని తమిళనాడు గవర్నర్ డాక్టర్ కొణిజేటి రోశయ్య పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఆర్యవైశ్య వాసవీ నిత్యాన్న సత్రం రజతోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం తాను ప్రజాప్రతినిధిని కానని, తమిళనాడు గవర్నర్‌గా రాజ్యాంగానికి లోబడి ప్రభుత్వ పాలన కొనసాగించడమే తన ధ్యేయమన్నారు. కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల మనోభాలకనుగుణంగా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతానన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆరు దశాబ్దాలుగా ఉద్యమం కొనసాగుతుం దన్నారు. ఈ ఉద్యమంలో తెలంగాణకు చెందిన వైశ్యులు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. వైశ్యులు తమ వ్యాపారాలకే పరిమితం కాకుండా రాజకీయాల్లోకి రావాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే రాజేశ్వర్‌రావు చెన్నమనేని రాజశ్వర్‌రావు మాట్లాడుతూ కుల సంఘాలు వ్యక్తిగతంగా కాకుండా తమ వర్గపు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సంఘటితంగా పనిచేస్తాయని, దీని వల్ల ఆయా కులాల్లో ఐకమత్యం ఏర్పడి వర్గ ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పారు.
దేవస్థానం చైర్మన్ బొమ్మ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కుల సంఘాలు నిత్యాన్న దానంలాంటి సౌకర్యాలు కల్పించడం వల్ల తమకు కొంత భారం తగ్గుతుందన్నారు. వేములవాడలో ఆర్యవైశ్య వాసవీ నిత్యాన్న సత్రం ద్వారా ఇప్పటికే లక్షలాది భక్తులకు భోజనం సౌకర్యం కల్పించారని తెలిపారు. మున్నూరు కాపు సంఘానికి సంబంధించి మరో నిత్యాన్న సత్రం, 100 గదుల నిర్మాణం చేపడుతున్నారని పేర్కొన్నారు.