రాజ్‌నాథ్‌ కుమారుడికి బెదిరింపులపై దర్యాప్తు


– బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు
– హెచ్చరించిన సీఎం ఆధిత్యనాథ్‌
నోయిడా, మే28( జ‌నం సాక్షి ) :  కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తనయుడు, నోయిడా ఎమ్మెల్యే పంకజ్‌ సింగ్‌కు వాట్సాప్‌ ద్వారా బెదిరింపు సందేశాలు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడా నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పంకజ్‌కు ఈనెల 25నుంచి గుర్తు తెలియని నంబర్ల నుంచి వరుసగా బెదిరింపు సందేశాలు వస్తున్నాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి.. సైబర్‌ సెల్‌కు అప్పగించారు. దీనిపై నోయిడా సెక్టార్‌ 20 పోలీస్‌స్టేషన్‌ అధికారి మనీష్‌ సక్సేనా మాట్లాడుతూ..’ఆదివారం సాయంత్రం మాకు సమాచారం అందింది. సెక్షన్‌ 384(బెదిరింపులకు పాల్పడింనందుకు), సెక్షన్‌ 507ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. అంతేకాకుండా ఐటీ చట్టంలోని కొన్ని సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశాం’ అని తెలిపారు. మెరుగైన విచారణ నిమిత్తం… ప్రస్తుతం ఈ కేసును సైబర్‌ సెల్‌కు బదిలీ చేశారు. ఈ మధ్య కాలంలో ఉత్తర్‌ ప్రదేశ్‌లోని భాజపా ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్‌, సందేశాలు రావడం ఎక్కువయ్యాయి. గతవారం దాదాపు 12మంది ఎమ్మెల్యేలకూ ఇదే పరిస్థితి ఎదురైంది. వివిధ వ్యక్తులపై ఉన్న క్రిమినల్‌ కేసులు ఎత్తివేయాలని కొందరికి, డబ్బు డిమాండ్‌ చేస్తూ కొందరికి వాట్సాప్‌ సందేశాలు అందాయి. అయితే ఈ ఘటనలన్నింటిపై ఆరాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్‌ స్పందించారు. ఇలాంటి విషయాలను తేలిగ్గా తీసుకోకూడదని, బెదిరింపులకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)ను ఏర్పాటు చేశారు.పంకజ్‌తో పాటు మరో 12 మంది భాజపా ఎమ్మెల్యేలకు బెదిరింపు సందేశాలు వస్తున్నాయని పోలీసులు తెలిపారు. రూ.పది లక్షలు చెల్లించకుంటే మూడురోజుల్లో వారి కుటుంబ సభ్యులను చంపేస్తామని ఒకే వ్యక్తి ఫోన్‌ నంబరు నుంచి సందేశాలు వచ్చినట్లు వెల్లడించారు.
—————————————