రాణించిన సమరవీర ఫాలోఆన్ తప్పించుకున్న లంక
కొలంబో ,నవంబర్ 27: కొలంబో టెస్టులో శ్రీలంక పోరాడుతోంది. టాపార్డర్ బ్యాట్స్‌మెన్ విఫలమైనప్పటకీ… మిడిలార్డర్‌లో సమరవీర, మాథ్యూస్ రాణించడంతో లంక ఫాలోఆన్ గండం తప్పించుకుంది. 3 వికెట్లకు 43 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో ఇవాళ ఇన్నింగ్స్ కొనసాగించిన ఆతిథ్య జట్టు నిలకడగా ఆడింది. ఓపెనర్ పరన్‌వితనా, మాథ్యూస్ నాలుగో వికెట్‌కు 90 పరుగులు జోడించారు. అయితే పరన్‌వితనా 40, మాథ్యూస్ 47, జయవర్థనే 12 పరుగులకు ఔటయ్యాక శ్రీలంక ఫాలోఆన్‌లో పడుతుందని కివీస్ అభిమానులు భావించారు. ఈ పరిస్థుతుల్లో సమరవీరా , రణ్‌దీవ్ అద్భుతంగా పోరాడారు. ఏడో వికెట్‌కు అజేయంగా 97 పరుగుల పార్టనర్‌షిప్ నమోదు చేశారు. ఈ క్రమంలో జట్టు స్కోరును 200 దాటించిన సమరవీరా హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. దీంతో శ్రీలంక ఫాలోఆన్ గండం నుండి గట్టెక్కింది. అయితే వెలుతురు సరిగా లేని కారణంగా మూడోరోజు త్వరగానే ఆటను ముగించారు. ఆట ముగిసే సమయానికి శ్రీలంక 6 వికెట్లకు 225 పరుగులు చేసింది. సమరవీరా 76 , రణ్‌దీవ్ 34 పరుగులతో క్రీజులో ఉన్నారు. 4 వికెట్లు చేతిలో శ్రీలంక ఇంకా 187 పరుగులు వెనుకబడి ఉంది.