రామాయణ గ్రంధాన్ని సమాజానికి అందించిన మహర్షి వాల్మీకి
భారతీయ చరిత్రలో సంస్కృత భాషలో పద్యాల రచన రామాయణంతోనే మొదలయ్యింది
పలు గ్రామాల్లో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు
నియోజకవర్గ ఎన్నికల సమన్వయ కర్త వంగూర్ ప్రమోద్ రెడ్డి
వనపర్తి బ్యూరో అక్టోబర్28 (జనంసాక్షి)
భారతీయ సంస్కృతి, ఇతిహాసాన్ని, మానవ సంబంధాలు, కుటుంబ విలువల సారాంశాన్ని అపురూపమైన రామాయణ గ్రంథంగా సమాజానికి అందించిన ‘వాల్మీకి మహర్షి’ భావితరాలకు ఆదర్శనీయం అని నియోజకవర్గ ఎన్నికల సమన్వయ కర్త వంగూర్ ప్రమోద్ రెడ్డి తెలిపారు. శనివారం వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ముందుగా పెబ్బేరు మండలంలోని శాకపూర్ గ్రామంలో వాల్మీకి విగ్రహానికి స్థానిక వాల్మీకి సంఘం సభ్యులతో కలిసి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వనపర్తి మండలం అచ్యుతాపురం గ్రామంలో వాల్మీకి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఎన్నికల సమన్వయ కర్త వంగూర్ ప్రమోద్ రెడ్డి మాట్లాడుతూ భారతీయ చరిత్రలో సంస్కృత భాషలో పద్యాల రచన రామాయణంతోనే మొదలయ్యిందని.. ఆ ఘనత ఒక్క వాల్మీకి మహర్షికే దక్కుతుందన్నారు.సంస్కృతంలో పద్యాలు రాసిన తొలికవి కూడా.. ఆ మహానేయులేనని ఆయన గుర్తు చేశారు. వాల్మీకి మహర్షి బ్రహ్మ దయతో రామాయణాన్ని సృష్టించాడని భారతీయ విశ్వాసం. ఇది భారతదేశపు మొదటి గొప్ప ఇతిహాసమని ఆయన కొనియాడారు. వాల్మీకిగా మారిన తర్వాత రామాయణ మహా గ్రంధాన్ని రచించి సీతారాముల జీవిత చరిత్ర తెలియజేయడంతో పాటు మనిషి జీవన విధానాన్ని మనుషుల మధ్య అనుబంధాలను ఆ గ్రంథం ద్వారా అందరికీ తెలియజేశారని ఆయన తెలిపారు. అలాంటి వాల్మీకి మహర్షి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని ప్రతి ఒక్కరూ వాల్మీకి మహర్షిని ఆదర్శంగా తీసుకొని తమ జీవితంలో చెడు అలవాట్లను వదిలిపెట్టి మంచి పనులు చేస్తూ జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల గ్రామాల వాల్మీకి సంఘం సభ్యులు నాయకులు పాల్గొన్నారు.