రాములోరి ఆహ్వాన పత్రికలో అచ్చుతప్పులు

రాములోరి ఆహ్వాన పత్రికలో అచ్చుతప్పులు
 పట్టాభిషేకం తేదీలో మార్పు

నిర్లక్ష్యంపై ఈఓ జ్యోతి సీరియస్

భద్రాచలం : భద్రాచలం దేవస్థానం అధికారుల నిర్లక్ష్యం మరోమారు బయట పడింది. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ముద్రించిన ఆహ్వాన పత్రికలో అచ్చుతప్పులు దొర్లాయి. శ్రీరామ మహా పట్టాభిషేక వైశిష్ట్యమును తెలియపరుస్తూ ఆహ్వానపత్రికలోని ఓ పేజీలో ముద్రించారు. అందులోనే పట్టాభిషేకం ఎప్పుడు నిర్వహించేది తెలుపుతూ తేదీని ముద్రించారు. వాస్తవంగా పట్టాభిషేకం ఈ నెల 16న జరగనుండగా, ఆహ్వాన పత్రికలో మాత్రం చైత్ర శుద్ధ దశమి ఆదివారం అనగా 29-03-2015న జరుగుతుందని పేర్కొన్నారు.

దీనిపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేలాదిగా ముద్రించిన ఆహ్వాన పత్రికలు ఇప్పటికే పంపిణీ మొదలైంది. రాష్ట్ర మంత్రులు, ఇతర ఉన్నతాధికారులకు వీటిని దేవస్థానం అధికారులు అందజేశారు.  జిల్లాలో ఉన్న వివిధ ఆధ్వాత్మిక సంస్థల నిర్వాహకులకు ఈ పుస్తకాలు వెళ్లాయి. అదే విధంగా వీటిని మీడియాకు కూడా అందజేశారు. పట్టాభిషేకం నిర్వహణ తేదీ త ప్పుగా ముద్రితమైందనే విషయాన్ని మీడియా ప్రతినిధులు దేవస్థానం అధికారుల దృష్టికి తీసుకెళ్లిన తర్వాతనే తప్పిదాన్ని వారు గుర్తించారు.

జరిగిన తప్పిదంపై దేవస్థానం ఈఓ కూరాకుల జ్యోతి తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఆహ్వాన పత్రిక తయారీలో భాగస్వామ్యులైన వారి నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని భావిస్తున్న ఆమె సదరు ఉద్యోగులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల కాలంలో దేవస్థానంలో తరచు తప్పిదాలు జరుగుతున్నప్పటకీ, వాటిని ఎత్తి చూపేవారిపై ఆలయ పెద్దలు తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు. తాజాగా జరిగిన ఈ పరిణామాలపై వారు ఏ రీతిగా స్పందిస్తారనేది వేచి చూడాల్సి ఉంది.

తాజావార్తలు