రాయల్స్‌కు షాక్
8 వికెట్ల తేడాతో గెలిచిన కోల్‌కతా
కోల్‌కతా :కోల్‌కతాలో శుక్రవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్లు కోల్పయి 132 పరుగులు చేసింది. ఓపెనర్ రహానె 6 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. వాట్సన్ 35 బంతుల్లో 35 పరుగులు చేసి నరేన్ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా ఔటయ్యాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఫల్కనర్ కూడా అభిమానులను నిరాశపరిచాడు. 4 బంతులు ఆడి కేవలం ఒక పరుగు మాత్రమే చేశాడు. అబ్దుల్లా బౌలింగ్‌లో షాట్ కొట్టబోయి గంభీర్‌కు క్యాచ్ ఇచ్చాడు. విశ్వనాథ శాంసన్ నిలకడగా ఆడి 36 బంతుల్లో 40 పరుగులు చేశాడు. భాటియా విసిరిన బంతికి కల్లీస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. యాగ్నిక్ 10, ఓవైశా 24, బిన్ని 3 (నాటౌట్), రాహుల్ ద్రావిడ్ 6 (నాటౌట్) పరుగులు చేశారు. 133 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 17.2 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ బ్యాట్స్‌మెన్ గంభీర్ 14 బంతుల్లో 12 పరుగులు చేసి వాట్సన్ బౌలింగ్‌లో యాగ్నిక్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. బిస్లా 25 బంతుల్లో 29 పరుగులు చేశాడు. చవాన్ బౌలింగ్‌లో షాట్ కొట్టబోయి రహానేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కల్లీస్ 30 బంతుల్లో 33 (నాటౌట్), పటాన్ 35 బంతుల్లో 49 (3 ఫోర్లు, 3 సిక్స్‌లు) పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర వహించాడు.