రాయల తెలంగాణ అంటే.. సీమ పెత్తనాన్ని ఆమోదించడమే..
రాష్ట్రాల విభజన ప్రజల ఆకాంక్ష మేరకే జరగాలి
శ్రీప్రభుత్వ సౌలభ్యం కోసం కాదు శ్రీ ప్రజాస్వామికంగానే ఉండాలి
ఆత్మగౌరవం కోసమే తెలంగాణ ఇంకెవరి ఆధిపత్యం సహించం : కోదండరామ్
హైదరాబాద్, జూన్ 29 (జనంసాక్షి):
హైదరబాద్ సహా పది జిల్లాలతో కూడి తెలంగాణను మాత్రమే తాము కోరుకుంటున్నామే తప్ప రాయల తెలంగాణను ఎట్టిపరిస్థితుల్లో ఆమోదించమని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజేఏసీ) చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. రాయల తెలంగాణ వద్దు- తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే కావాలని కోరుతూ శుక్రవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఒక వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాయల తెలంగాణ అంటే సీమ పెత్తనాన్ని ఆమో దించడమేనన్నారు. తెలంగాణ ప్రజలు సీమాంధ్రుల పెత్తనాన్ని వ్యతిరేకిస్తున్నారని, రాయల తెలంగాణ ప్రతిపాదనను ముందుకు తేవడం అంటే మరోమారు సీమాంధ్రుల పెత్తనాన్ని కొనసాగించడమే అవుతుంద న్నారు. ఇంకొకరి ఆధిపత్యాన్ని భరించడానికి తెలంగాణ ప్రజలు
సిద్ధంగా లేరని, సీమాంధ్రుల ఆధిపత్యాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని కోదండరాం అన్నారు. ఆత్మగౌరవం కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటున్నామని, ప్రభుత్వ సౌలభ్యం కోసం కాకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే రాష్ట్ర విభజన జరగాలని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని, హైదాబాద్ సహా పది జిల్లాలతో కూడిన తెలంగాణ మాత్రమే తాము కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. హైదరాబాద్ లేని తెలంగాణను ఊహించలేమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణపై కేంద్రం సానుకూల నిర్ణయాన్ని ప్రకటించే తరుణంలో కొందరు కాంగ్రెస్ నేతలు రాయల తెలంగాణ ప్రతిపాదన తెస్తూ తెలంగాణను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.రాయల తెలంగాణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా తెలంగాణలోని పది జిల్లాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన చెప్పారు.వచ్చే నెల ఏడవ తేదీన జరిగిన జేఏసీ విస్తృతస్థాయి సమావేశంలో తెలంగాణ ఉద్యమ కార్యచరణ ఖరారు చేస్తామని కోదండరాం తెలిపారు.