రాష్ట్రస్థాయిలో పంటల బీమా పథకాన్ని అమలు చేయాలి

సూర్యాపేట టౌన్(జనంసాక్షి): రాష్ట్రస్థాయిలో పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు.శుక్రవారం పంటల బీమా రాష్ట్ర స్థాయి పథకాన్ని ఏర్పాటు చేసి అమలు చేయాలని కోరుతూ కలెక్టరేట్ నందు ఏఓకు వినతి పత్రం అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పసల్ బీమా యోజన పథకాన్ని 2016లో జాతీయస్థాయిలో ప్రారంభించిందన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ బీమా పథకాన్ని అమలు చేయడం లేదన్నారు.రాష్ట్రస్థాయిలో పంటల బీమా పథకాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి అమలు చేయకపోవడం సరికాదన్నారు.గత రెండేళ్లుగా జిల్లాలో తామర పురుగు వల్ల వందలాది ఎకరాల్లో మిరప పంటకు నష్టం వాటిల్లిందన్నారు.భీమా పథకం అమలులో లేకపోవడం వల్ల నష్టపోయిన రైతులకి ఎలాంటి నష్టపరిహారం అందలేదని పేర్కొన్నారు.దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించి మిర్చి పంటను నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.బీమా పథకాన్ని అమలు చేస్తే ప్రకృతి వైపరీత్యాలు, చీడ పురుగుల వల్ల నష్టపోయిన రైతులకు పెట్టిన పెట్టుబడికి, శ్రమకు తగ్గట్లుగా నష్టపరిహారం వచ్చే అవకాశం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి దొడ్డా వెంకటయ్య , సీతమ్మ , సాయి కార్తీక్, దశరథ, లింగారెడ్డి,నర్సయ్య, వెంకటేశ్వర్లు, నాగయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.