రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తులకు కట్టుబడి ఉన్నాం
` నేడు సచివాలయంలో ఆరుగ్యారెంటీలపై సమీక్ష
` పలు కీలక అంశాలపైనా మంత్రి వర్గభేటలో చర్చించే అవకాశం
హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో నేడు తెలంగాణ క్యాబినెట్ భేటీ కానున్నది. ముఖ్యంగా నెల రోజుల కాంగ్రెస్ పరిపాలన, ఆరు గ్యారంటీల అమలుపై ఈ సమావేశంలో చర్చ జరుగనుంది. అదేవిధంగా పలు కీలక అంశాలు కూడా ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా, మల్లు భట్టివిక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత తొలి నెల రోజుల పాలన పూర్తయ్యింది. ఈ నెల రోజుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం.. కేసీఆర్ సర్కారు రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిందని ఆరోపిస్తున్నది. ఈ ఆరోపణలను బీఆర్‌ఎస్ తిప్పికొట్టింది. ఆరు గ్యారంటీల అమలు నుంచి తప్పించుకునేందుకే కాంగ్రెస్ ఈ కుటిల ఆరోపణలు చేస్తోందని మండిపడిరది.
ప్రజాపాలనకు ప్రత్యేక వెబ్‌సైట్
` నేడు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి):డిసెంబర్ 26 నుంచి ఈ నెల 6 వకు నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంపై సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నత స్థాయి సవిూక్ష నిర్వహించనున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు వివిధశాఖలకు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, నోడల్ అధికారులు, సీజీజీ డైరెక్టర్ జనరల్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సహా ఉన్నతాధికారులు సమావేశానికి హాజరుకానున్నారు.సమావేశంలో ప్రజాపాలనపై ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్ ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. పది రోజుల పాటు నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అందాయి. ఇందులో ఐదు గ్యారంటీలకు సంబంధించి 1,05,91,636 దరఖాస్తులు కాగా.. ఇతర అభ్యర్థలనకు సంబంధించి 19 ,92 ,747 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలోని 16,392 గ్రామ పంచాయితీలు, 710 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన గ్రామసభలను నిర్వహించగా.. ఇందులో 1,11,46,293 మంది పాల్గొన్నారు. మొత్తం 3,714 అధికారుల బృందాలు దరఖాస్తులు స్వీకరించారు. ఇందు కోసం 44 ,568 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ప్రజాపాలన సజావుగా జరిగేందుకు పది ఉమ్మడి జిల్లాలు, జీహెచ్‌ఎంసీలోని ఐదు జోన్లకు ఒక్కొక్క సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక పర్యవేక్షణాధికారులుగా ప్రభుత్వం నియమించింది. ఈ దరఖాస్తులన్నింటిని జనవరి 17లోగా డేటా ఎంట్రీ చేయాలని సంబంధిత కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.
ఈ ప్రయాణం ఓ కొత్త అనుభూతి
` నెల రోజుల పాలనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణలో నెల రోజుల కాంగ్రెస్ పాలనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ ప్రస్థానం తనకు తృప్తినిచ్చిందని పేర్కొన్నారు.’’సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ.. సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాటను నిలబెట్టుకుంటూ.. పాలనను ప్రజలకు చేరువ చేస్తూ.. అన్నగా నేనున్నానని హావిూ ఇస్తూ జరిగిన నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చింది.పేదల గొంతుక వింటూ.. యువత భవితకు దారులు వేస్తూ.. మహాలక్ష్ములు మన ఆడబిడ్డల ముఖంలో ఆనందాలు చూస్తూ.. రైతుకు భరోసా ఇస్తూ..సాగిన ఈ నడక ఉజ్వల భవిత వైపునకు అడుగులు వేస్తోంది. పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామంటూ.. పారిశ్రామిక వృద్ధికి పెద్దపీట వేస్తూ.. నగరాల అభివృద్ధికి నగిషీలు చెక్కుతూ.. మత్తులేని చైతన్య తెలంగాణ కోసం గట్టి పట్టుదలతో ఈ పాలన బాధ్యతగా సాగింది. తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందు కూడా నా బాధ్యత నిర్వర్తిస్తా’’ అని రేవంత్ వెల్లడిరచారు.