రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జిగా దిగ్విజయ్‌ సింగ్‌

తెలంగాణ వ్యతిరేకులకు కేంద్రంలో పదవులు
సంజీవ్‌, కావూరి, చిన్నాలకు అందలం
నేడు కేంద్ర కేబినెట్‌ పునర్వ్యస్థీకరణ
న్యూఢల్లీి, జూన్‌ 16 (జనంసాక్షి) :
కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల ఇన్‌చార్జిగా దిగ్విజయ్‌సింగ్‌ నియమితులయ్యారు. ఇప్పటి వరకూ ఆ పదవిలో కొనసాగిన గులాంనబీ ఆజాద్‌ను కేబినెట్‌కు పరిమితం చేశారు. 2014 ఎన్నికల దిశగా కాంగ్రెస్‌ పార్టీ అడుగులేస్తోంది. ఇప్పటినుంచే ఆ దిశగా వివిధ పదవుల్లో నియమకాలు చేపట్టింది. తాజాగా ఆదివారం సాయంత్రం ఏఐసీసీ కార్యవర్గాన్ని అధిష్టానం ప్రకటించింది. ప్రధాన కార్యదర్శులుగా 12 మందిని, కార్యదర్శులుగా 42 మందిని నియమించింది. సీడబ్ల్యూసీ సభ్యులుగా బేణీప్రసాద్‌, మురళీదేవరా, చిదంబరం, ఫోతేదార్‌, ఫెర్నాండేజ్‌, అజిత్‌జోగి, అమరీందర్‌సింగ్‌, మొహసినా కిద్వాయ్‌, ఆర్‌కెే థావన్‌, శివాజీరావ్‌ దేశ్‌ముఖ్‌ తదితరులు కొనసాగుతారు. ప్రత్యేక ఆహ్వానితులుగా అనిల్‌శాస్త్రి, సంజీవరెడ్డి, మొహిందర్‌సింగ్‌, రాజ్‌బబ్బర్‌, రషీద్‌ మసీదులను నియమించారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి పార్టీలోని అన్ని విభాగాల బాధ్యతలను అప్పగించారు. ఏఐసీసీ కోశాధికారిగా మోతీలాల్‌ వోరా నియమితులయ్యారు. ప్రధాన కార్యదర్శులుగా అజయ్‌మాకెన్‌, సీపీ జోషి, అంబికాసోని, హరిప్రసాద్‌, దిగ్విజయ్‌సింగ్‌, గురుదాస్‌ కామత్‌, జనార్దన ద్వివేదీ, మధుసూదన్‌ మిస్త్రీ, ఫెలిరో, ముకుల్‌ వాస్నిక్‌, షకీల్‌ అహ్మద్‌, మోహన్‌ప్రకాశ్‌ను నియమించారు. ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి బాధ్యతల నుంచి కేంద్ర మంత్రి ఆజాద్‌ను తప్పించారు. ఆయన స్థానంలో దిగ్విజయ్‌సింగ్‌ను నియమించారు. ఇదిలా ఉండగా గతంలో దిగ్విజయ్‌సింగ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జిగా పనిచేసిన విషయం తెలిసిందే.
సోనియా కార్యదర్శిగా..
యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శిగా అహ్మద్‌ పటేల్‌ను కొనసాగించారు. అలాగే సోనియాగాంధీ రాజకీయ కార్యాలయ బాధ్యతలను అంబికాసోనీకి అప్పగించారు.
రాష్ట్రం నుంచి..
రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావును ఏఐసీసీ కార్యదర్శిగా కొనసాగించింది. ఏఐసీసీ కార్యదర్శిగా వనపర్తి మాజీ ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డిని నియమించింది. ఏలూరు ఎంపి కావూరి సాంబశివరావును సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితునిగా నియమించింది. ఐఎన్‌టియుసి అధ్యక్షుడు సంజీవరెడ్డిని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితునిగా నియమిస్తున్నట్టు ప్రకటించింది. ఇదిలా ఉండగా ఏఐసీసీ తాజా కార్యవర్గం కూర్పులో రాష్ట్రానికి చెందిన పొంగులేటి సుధాకర్‌కు చోటు దక్కలేదు. వీరిలో కావూరి సాంబశివరావు, సంజీవరెడ్డి, చిన్నారెడ్డి తెలంగాణ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినవారే. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ కోరుకునే వారెవరికీ కీలక బాధ్యతలు, పదవులు అప్పగించలేదు.
12 మందికి మరిన్ని బాధ్యతలు
12 మంది ప్రధాన కార్యదర్శులకు వివిధ రాష్ట్రాల కాంగ్రెస్‌పార్టీ వ్యవహారాల బాధ్యతలను అప్పగించింది.  దిగ్విజయ్‌సింగ్‌-ఆంధ్రప్రదేశ్‌, గోవా, కర్నాటక, హరిప్రసాద్‌-ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, ఒడిస్సా, అంబికాసోని-హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూకాశ్మీర్‌, సీపీ జోషి-అస్సాం, బీహార్‌, పశ్చిమబెంగాల్‌, అండమాన్‌ నికోబార్‌, జనార్దన ద్వివేది-ఎఐసిసి వ్యవహారాలు, సమన్వయం, గురుదాస్‌ కామత్‌-గుజరాత్‌, రాజస్థాన్‌, దాద్రానగర్‌Ñ మధుసూదన్‌ మిస్త్రీ-ఉత్తరప్రదేశ్‌, ఎన్నికల కమిటీలు, ఫెలిరో-అరుణాచల్‌, మేఘాలయ, సిక్కిం, నాగాలాండ్‌, మణిపూర్‌, త్రిపుర, ముకుల్‌ వాస్నిక్‌-కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, లక్షద్వీపాలు, షకీల్‌ అహ్మద్‌-ఢల్లీి, పంజాబ్‌, హర్యానా, చండీఘడ్‌, మోహన్‌ ప్రకాశ్‌-మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల బాధ్యతలను అప్పగించారు. ఇదిలా ఉండగా శనివారం కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన మరో ప్రధాన కార్యదర్శి అజయ్‌మాకెన్‌కు మీడియా వ్యవహారాల బాధ్యతలను అప్పగించారు. సోమవారం 5.30 గంటలకు కేంద్ర కేబినెట్‌ పునర్వ్యస్థీకరించనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించే ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఎనిమిది మందికి కొత్త వారికి కేబినెట్‌లో చోటు దక్కనున్నట్లు సమాచారం. రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యులు వి. హనుమంతరావు, నంది ఎల్లయ్యలకు కేబినెట్‌లో చోటు దక్కవచ్చనే ఊహాగానాలు సాగుతున్నాయి. వీరితో పాటు మరికొందరు నేతలు కూడా అధిష్టానం మెప్పు కోసం తుది ప్రయత్నాలు సాగిస్తున్నారు.