రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ ని దోషిగా చూపే కుట్ర

–  ప్రభుత్వంలో కొనసాగుతూ సీఎంకు అపవాదు చేసే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు
–  అధికారుల తీరుతోనే రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర నష్టం
– కేసీఆర్ ఆదేశాలు పాటించని అధికారులను సస్పెండ్ చేయాలి
– డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో అత్యంత దుర్మార్గం
– అసాంఘిక చర్యలకు అడ్డగా కల్వకుర్తి క్రీడా మైదానం
-క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దృష్టికి తీసుకు వెళ్లిన మాజీమంత్రి
–  అవినీతి దొంగలపై పోరాటం కొనసాగిస్తా
– మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్

నాగర్ కర్నూల్ జిల్లా బ్యూరో జనంసాక్షి, ఆగస్టు 19:

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అద్వితీయ పోరాటం సాగించి ఆమరణ నిరాహార దీక్షతో పాటు, సకల జనులను ఒక్క తాటిపైకి తీసుకురావడంలో నాటి ఉద్యమ నేత, సీఎం కేసీఆర్ నూటికి నూరుపాళ్ళు విజయం సాధించడం జరిగిందని మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన అనంతరం బంగారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా సీఎం కేసీఆర్ అకుంఠిత దీక్షతో, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అద్వితీయంగా ప్రజాసంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అయితే కొంతమంది అధికారులు, రాజకీయ నేతల తీరుతో రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ కు అపవాదు తీసుకువచ్చే ప్రయత్నం, కుట్ర జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం కోట్లాది రూపాయలు వెచ్చించిన సీఎం కేసీఆర్ ఇల్లు లేని కుటుంబం రాష్ట్రంలో ఉండొద్దనే లక్ష్యంతో అద్వితీయ కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. అయితే కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు సెప్టిక్ ట్యాంక్ నిర్మించేందుకు కనీసం స్థలం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రణాళిక రహిత పనులు చేయడంతో లక్షల కోట్లు వెచ్చించి నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రస్తుతం నిరుపయోగంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని కల్వకుర్తి డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ మాట్లాడుతు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టి, నిరుపేద కుటుంబాలకు చెందిన ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని లక్ష్యంతో ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సీఎం కేసీఆర్ చిరకాల వాంఛాయని తెలిపారు. అయితే స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు, అధికారుల తీరుతో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కల సాకారం నేటికీ కాకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా ఉండే అధికారులు, ప్రజాప్రతినిధులు సంబంధిత నిపుణుల ఆదేశాలు, సూచనలు, ప్రణాళిక పాటించకుండా ఇష్టానుసారంగా ఎవరికి తోచిన విధంగా వారు ఎక్కడపడితే అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్ల నిర్మాణం చేపట్టడంతో ప్రస్తుతం డబల్ బెడ్ రూమ్ ఇండ్లు చిన్నపాటి వర్షాలకే లోతట్టు ప్రాంతాల్లో నిర్మించిన నేపద్యంలో నీటితో నిండుకుండలను తలపిస్తున్నాయని పేర్కొన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో వందల సంఖ్యలో ఇల్లు నిర్మించినప్పటికి, ఇండ్లను అర్హులైన ప్రజలకు నేటికీ కేటాయించకపోవడం దురదృష్టకరమని తెలిపారు. ఇండ్ల నిర్మాణం పూర్తయి ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నప్పటికీ లబ్ధిదారులు, నిజమైన పేదలకు ఎందుకు స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు, అధికారులు పంపిణీ చేయడం లేదో ఈ ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు . కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్ర ప్రభుత్వం ఇండ్ల నిర్మాణం చేపడితే స్థానికంగా ఇష్టాను సారంగా వ్యవహరిస్తున్న అధికారులు, ప్రజాప్రతితుల తీరుతో రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత చెడ్డ పేరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కల్వకుర్తిలోని డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు ఒక్క గదికి కూడా కిటికీలు లేవని, ప్రతి గదిలో సిమెంటు, ఇటుక తదితర వ్యర్థాలతో నిండుకొని ఉన్నాయని పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పరిసరాలు పూర్తిగా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారాయని కుక్కలు, పక్షులు, పందులకు ఆవాసంగా మారాయని ఆయన పేర్కొన్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఇండ్లు ఈ విధంగా పక్షులు, కుక్కలకు ఆవాసలుగా మారడం దురదృష్టకరమని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం నిరంతరం అకుంఠిత దీక్షతో ప్రయత్నం చేస్తుంటే, స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు, అధికారులు మాత్రం కెసిఆర్ కు చెడ్డ పేరు తీసుకొచ్చేలా ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కల్వకుర్తిలోని క్రీడా మైదానం నిర్మించి సుమారు 10 ఏళ్లకు పైబడినా, నేటికి క్రీడ మైదానాన్ని వినియోగంలోకి తీసుకురాలేదని  పేర్కొన్నారు. క్రీడ మైదానం కోసం కోట్లు వెచ్చించి క్రీడా మైదానం చేపడితే ఏ ఒక్కరికి కూడా క్రీడమైదానము ఉపయోగపడడం లేదని పేర్కొన్నారు. క్రీడా మైదానం గదులకు సంబంధించి గుర్తు తెలియని వ్యక్తులు గోడలకు ప్రత్యేకంగా డోర్లను ఏర్పాటు చేసుకొని ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన సిమెంటు, సీకు, ధాన్యం తదితర వాటిని నిల్వ ఉంచుతున్నారంటే స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు అధికారులు క్రీడ మైదానం పట్ల ఏ విధంగా శ్రద్ధ చూపుతున్నారని దానికి నిదర్శనం అని పేర్కొన్నారు. క్రీడా మైదానం పూర్తిగా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిందని రాత్రి వేళల్లో తాగేందుకు గుర్తుతెలియని వ్యక్తులు అక్కడ వచ్చి, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేందుకు మాత్రమే కల్వకుర్తిలోని క్రీడా మైదానం వినియోగ పడుతుందని తెలిపారు. క్రీడలతో అంతర్జాతీయ జాతీయ స్థాయిలో రాణించేందుకు అవకాశం ఉంటుందని చిత్తరంజన్ దాస్ తెలిపారు. ప్రతి చిన్నారి, యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాల్సిన అవసరం ఉందని పల్లెలు, పట్టణాలు అని తేడా లేకుండా యువతని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అయితే కల్వకుర్తి లాంటి నియోజకవర్గం కేంద్రంలో నేటికీ క్రీడా మైదానం వినియోగంలోకి రాకపోవడం నిజంగా దురదృష్టకరమని పేర్కొన్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి, నిర్మించిన క్రీడా మైదానం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రస్తుతం  నిరుపయోగంగా, దిష్టిబొమ్మలుగా మారాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు, అధికారులు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను  నిజమైన లబ్ధిదారులకు పంపిణీ చేయడంతో పాటు, క్రీడా మైదానాన్ని వినియోగంలోకి తీసుకువచ్చి కల్వకుర్తి పరిసర ప్రాంతాల్లో నీ ప్రజలందరికీ, యువతకు క్రీడల్లో రాణించెందుకు అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలోనే కల్వకుర్తి క్రీడా మైదానానికి శాంక్షన్ ఇవ్వడం జరిగిందని, నిధులు సైతం తాను లెటర్ ఇవ్వడంతోనే అనంతరం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిధులు మంజూరు చేయడం జరిగిందని చిత్తరంజన్ దాస్ తెలిపారు. కల్వకుర్తి ప్రాంతం అభివృద్ధిలో నేటికీ అత్యంత వెనుకబడి ఉందని, ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ ప్రాంత ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. లేదంటే కల్వకుర్తి అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కల్వకుర్తి నియోజకవర్గం లో నెలకొన్న సమస్యలన్నీటిపై దృష్టి సారిస్తూ, పోరాటాలు మరింత ఉదృతం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కల్వకుర్తి  తాలుకా అభివృద్ధి సాధన కమిటీ చైర్మన్ యాచారం వెంకటేశ్వర్లు గౌడ్ గారు, ఉపాధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, తాలుకా అభివృద్ధి సాధన కమిటీ మహిళ అధ్యక్షురలు తలకొండపల్లి ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దయ్య యాదవ్, తాలుకా అభివృద్ధి సాధన కమిటీ సీనియర్ నాయకులు జేఏసీ సదానందం గౌడ్, కల్వకుర్తి మండల అధ్యక్షుడు మాజీ సర్పంచ్ పుట్ట శేఖర్ ముదిరాజ్ ,కల్వకుర్తి తాలుకా అభివృద్ధి సాధన కమిటీ కార్యదర్శి కనుగుల శేఖర్,కల్వకుర్తి తాలుకా అభివృద్ధి సాధన కమిటీ కల్వకుర్తి పట్టణ అధ్యక్షులు రామాంజనేయులు, నాయకులు , శశి కుమార్ గౌడ్, సత్యం, గోపాల్, శ్రీశైలం గౌడ్, లక్ష్మయ్య, దివాకర్ గౌడ్, అంజి, శివ గౌడ్,రమేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు