రాష్ట్ర ప్రయోజనాలకోసం జిల్లాలు ఏర్పాటు చేయండి

3

– స్వలాభం కోసం వద్దు

– డీకే అరుణ డిమాండ్‌

హైదరాబాద్‌,మే17(జనంసాక్షి): కొత్త జిల్లాల ఏర్పాటు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని… రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజా అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేయొద్దని మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ ప్రభుత్వానికి సూచించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా గద్వాలను ప్రత్యేక జిల్లా చేయాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు ఆమె మంగళవారం  వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న కొత్త జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగా లేదన్నారు. గద్వాలను జిల్లాగా ఏర్పాటుచేసేవరకు తాము పోరాటం చేస్తామన్నారు. దీనిపై త్వరలోనే సీఎం కేసీఆర్‌ను కలిసి సమస్యను వివరిస్తామన్నారు. కొత్త జిల్లాల కోసం అనేక చోట్ల ఆందోళనలు జరుగుతున్నాయని అరుణ తెలిపారు. గద్వాల కోసం అఖిలపక్షం ఆందోళన చేస్తోందన్నారు. నిజానికి ఎక్కడెక్కడ ఏయే జిల్లా ఏర్పాటు చేస్తున్నారో ప్రకటించాలన్నారు. ఇదిలావుంటే నారాయణపేటను జిల్లా చేయాలంటూ అక్కడి అఖిలపక్షనేతలు రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి నినాదాలుచేశారు. అన్ని అర్హతలు ఉన్న నారాయణపేటను జిల్లా చేయాలన్నారు. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు. దీంతో పాలమూరులోనే జిల్లాల కోసం ఆందోళన తీవ్రం అవుతోంది.