రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వంశీచందర్‌రెడ్డి
హైదరాబాద్, జూలై 14 (జనంసాక్షి) :
రాష్ట్ర యువజన కాంగ్రెస్‌కు జరిగిన ప్రతిష్టాత్మకమైన సంస్థాగత ఎన్నికల్లో ఆ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ వంశీచందర్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఈ నెల 11, 12 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ యువజన కాంగ్రెస్ పదవులకు సంబంధించి ఎన్నికలు నిర్వహిం చారు. 42 పార్లమెంట్ నియోజకవర్గాలకు యువజన విభాగం కన్వీనర్ల ఎన్నికలతో పాటు రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించిన పోలీంగ్ కూడా పెద్దఎత్తున జరిగింది. రాష్ట్ర అధ్యక్ష పదవికి వంశీచందర్‌రెడ్డితోపాటు సికింద్రాబాద్ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి కుమారుడు పురూర్వరెడ్డి, భిక్షపతి యాదవ్ కుమారుడు పోటీ పడ్డారు. ఈ పోటీలలో డాక్టర్ వంశీచందర్‌రెడ్డి 13,739 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. రెండో స్థానంలో అనిల్‌కుమార్ యాదవ్ నిలిచారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఉన్న ఒక హోటల్ వద్ద వంశీచందర్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్ అనుచ రుల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. పోలీసులు ఇరువర్గాలను తరిమేశారు. యువజన కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా వంశీచందర్‌రెడ్డి ఎన్నికైనట్టు ప్రకటించారు. ఆయన గతంలో ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. దివం గత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉండేవి. పైగా వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి అత్యంత సన్నిహి తుడన్న పేరు కూడా వచ్చింది. వైఎస్ మరణానికి సంబంధించి తలెత్తిన వివాదంలో రాష్ట్ర వ్యాప్తంగా రిలయన్స్ సంస్థలపై జరిగిన దాడుల్లో వంశీచందర్‌రెడ్డి నిందితుడిగా ఆయనపై కేసు నమోదు కావడం, ఆ తరువాత జగన్‌కు కారణాలేమైనా ఆయన దూరం కావడం జరిగింది. జగన్‌తో ఆయనకు సంబంధాలు కొనసాగుతున్నాయని, ఏ పరిస్థితుల్లోనూ వంశీచందర్‌రెడ్డి యువజన కాంగ్రెస్ సారథిగా ఎన్నిక కాకూడదని తీవ్ర ప్రయత్నాలు చేసినా సీనియర్ నేతలకు ఈ ఎన్నికల ఫలితాలు కంగుతినిపించాయి. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆయనకు కోస్తా ప్రాంతంలోనే అత్యధిక ఓట్లు రావడం విశేషం. దాదాపుగా కోస్తా ప్రాంతం అంతా అన్ని జిల్లాల్లోనూ ఆయన ప్యానల్‌నేతలే యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.