రాహుల్ మాట విననందుకే నన్ను తప్పించారు:జయంతి నటరాజన్
-కాంగ్రెస్ పార్టీకి రాజీనామా
చెన్నై,జనంసాక్షి: కేంద్రమాజీ మంత్రి, సీనియర్ మహిళా నేత జయంతి నటరాజన్ కాంగ్రెస్ పార్టీని వీడారు. శుక్రవారం మధ్యాహ్నం చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జయంతి నటరాజన్ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు చెప్పారు. కాంగ్రెస్‌ను వీడటం బాధాకరమని, భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయమని వెల్లడించారు. గత 30 ఏళ్లుగా కాంగ్రెస్‌లో ఉన్నానని, తన తాత కాంగ్రెస్ సీఎంగా పనిచేశారని గుర్తు చేశారు. పార్టీలో తనకు ఇచ్చిన అవకాశాలకు కృతజ్ఞతలు తెలిపారు. తాను కాంగ్రెస్‌లో చేరినప్పుడు పరిస్థితితులు వేరు…ప్రస్తుత పరిస్థితులు వేరని వివరించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో విలువలు లేవని విమర్శించారు. తాను ఏ తప్పూ చేయలేదని, పార్టీ అధికార ప్రతినిధి పదవి నుంచి ఎందుకు తొలగించారో తెలియదన్నారు. వేదాంత, అదానీకి అనుమతులు తిరస్కరించాలని రాహుల్ సూచించారని వెల్లడించారు. రాహుల్ చెప్పినట్లు వినకపోవడం వల్లే 2013లో తనను మంత్రి పదవి నుంచి తొలగించారని పేర్కొన్నారు. గడిచన 11 నెలలగా తీవ్ర మానసిక వేదనకు గురైనట్లు వివరించారు.