రాహుల్‌ సెలవు చీటీ

4

కొంతకాలంపాటు అన్ని కార్యక్రమాలకు దూరం

న్యూఢిల్లీ,ఫిబ్రవరి23(జనంసాక్షి): కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కొంతకాలంపాటు అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉండేందుకు నిర్ణయించుకున్నారు. పార్లమెంటు సమావేశాల ప్రారంభం రోజే కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సభకు గైర్హాజరయ్యారు. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి సోమవారం ప్రసంగించారు. ఈ సభకు రాహుల్‌ హాజరు కాలేదు. ఈ విషయమై విలేకరులు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీని ప్రశ్నించారు. రాహుల్‌ కొన్ని వారాల పాటు సెలవు కోరగా అందుకు సభ అంగీకారం తెలిపిందని ఆమె చెప్పారు. ‘దిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడంతో పార్టీ ఆత్మ పరిశీలనలో పడింది. కాంగ్రెస్‌ భవిష్యత్‌ ప్రణాళికలు రూపొందించి, పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాలుపంచుకోవాలన్న ఉద్దేశంతోనే ఆయన సెలవు తీసుకున్నారు’ అని పార్టీ వర్గాలు తెలిపాయి. త్వరలో జరగనున్న ఏఐసీసీ సమావేశాన్ని అత్యంత ప్రాధాన్యమైనదిగా రాహుల్‌ భావిస్తున్నారని వారు పేర్కొన్నారు.పార్టీలో నెంబర్‌ టూ గా ఉన్న రాహుల్‌ పార్లమెంట్‌ సమావేశాలకు ముందు సెలవు తీసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఏప్రిల్‌ లో జరగనున్న నాయకత్వ సదస్సు వరకు రాహుల్‌ పార్టీకి దూరంగా ఉండనున్నారు. ఆ సదస్సుకు ఆయన పూర్తి స్థాయిలో సిద్ధం అయ్యేందుకు…ఈ శెలవు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్‌ పార్టీ..తమ భవిష్యత్తు ప్రణాళికలను తయారు చేయాలనుకుంటోంది. ఏప్రిల్‌ లో జరగనున్న కాంగ్రెస్‌ కమిటీ సమావేశాల కోసం రాహుల్‌ పూర్తి స్థాయిలో సన్నద్ధం కానున్నారు. సెలవు సమయంలో రాహుల్‌..పార్టీ భవిష్యత్తు విధివిధానాలను రూపొందించనున్నారు. కొన్ని వారాల సెలవు తర్వాత..మళ్లీ రాహుల్‌ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రాహుల్‌ కు అదనపు బాధ్యతలు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.