రియల్‌ఎస్టేట్‌ వ్యాపారుల కోసం తెలంగాణ సాధించలేదు

4

వాస్తు ప్రకారం పాలనవద్దు

రాజ్యాంగం ప్రకారం పాలించాలి

చెస్ట్‌ ఆసుపత్రిని తరలించొద్దు

జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌

హైదరాబాద్‌,ఫిబ్రవరి12(జనంసాక్షి) : రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల అభివృద్ధి లక్ష్యంగా పాలన సరికాదని రాజకీయ ఐకాస చైర్మన్‌ కోదండరాం అన్నారు. అందువల్లే గత పాలకులను ప్రజలు తిరస్కరించారన్నారు. వాస్తు మార్గదర్శకం ప్రకారం పాలన సాగించడం మంచిది కాదని, రాజ్యాంగం ప్రకారమే పాలన చేయాలని సూచించారు. పది వామపక్షాల ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఛాతి ఆస్పత్రి తరలింపు అంశంపై చేపట్టిన  రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌ను అందంగా అభివృద్ది చేయడంలో తప్పు లేదు కానీ దానిని రియల్‌ వ్యాపారులకు అప్పగించే ప్రయత్నాలు సరికాదని అన్నారు. నెక్లెస్‌ రోడ్డును అభివృద్ది చేస్తే దాని చుట్టూ పుడ్‌ కోర్టుల, జలవిహారాలు వచ్చాయని దానివల్ల మనకు లాభం లేదన్నారు. హైదరాబాద్‌లో వందలాది పరిశ్రమలు మూతబడ్డాయని, వేలాది కార్మికుల బతుకులు వీధినపడ్డాయని ఐకాస నేత ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు.  వృత్తిదారుల బతుకుదెరువు ఛిన్నాభిన్నమైందన్నారు. హైదరాబాద్‌ నగరాన్ని పాలకులు మర్చిపోవడంతో వికృతరూపం సంతరించుకుందన్నారు. పాలు, కూరగాయలు అమ్మే ప్రైవేటు కంపెనీలు తీసుకొచ్చారని ఆరోపించారు. రియల్‌ ఎస్టేట్‌ అవసరాల కోసం ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేశారని ఆయన ఆరోపించారు. దక్షిణ భారత దేశంలోనే తోళ్ల పరిశ్రమకు హైదరాబాద్‌ ప్రసిద్ధి అని అలాంటి హైదరాబాద్‌ ఇప్పుడు మూడు రకాల సంక్షోభాలకు నిలయంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సంక్షోభాల నుంచి బయటపడే మార్గాలను అనుసరించాల్సి ఉందన్నారు. సామాన్యులకు అండగా ఉండాల్సిన తరుణం ఇదన్నారు. ఇందుకు అనుగుణంగా పాలకులు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్నారు. సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకటరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెస్టు ఆస్పత్రి-సచివాలయ తరలింపుపై టీసర్కార్‌ పునరాలోచన చేయాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. టీ.సర్కార్‌ ప్రజా వ్యతిరేక విధానాలపై వామపక్షాల ఆధ్వర్యంలో హైదరాబాద్‌ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సదస్సులో పాల్గొని, ఆయన ప్రసంగించారు. టీ.ప్రభుత్వ పరిపాలన నియంతృత్వ, అహంకార ధోరణిలో కొనసాగుతుందని విమర్శించారు. చెస్టు ఆస్పత్రి, సచివాలయ తరలింపు సరికాదని.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలన్నారు. కేంద్రం మత మార్పిడిలను ప్రొత్సహించిందని తెలిపారు. కేంద్రం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తే ఢిల్లీలో మోడీకి ఆప్‌ చేతిలో ఎంత గతి పట్టిందో.. అదే గతి టీసర్కార్‌ కు పడుతుందని హెచ్చరించారు. టీ.సర్కార్‌ ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్నారు. అందమైన నగరాలు ఉంటేనే పెట్టుబడులు రావని.. పెట్టుబడిదారులకు లాభాలు ఎక్కడ ఉంటే అక్కడ పెట్టుబడులు పెడతారని చెప్పారు. పరిశ్రమలు నెలకొల్పాలంటే విద్యుత్‌ ముఖ్యమని తెలిపారు. సీఎం కేసీఆర్‌ చెస్టు, సచివాలయ తరలింపు నిర్ణయాన్ని మార్చుకోవాలని హితవు పలికారు. లేని ఎడల జిల్లా, మండల స్థాయిల్లో ఉద్యమిస్తామని హెచ్చరించారు.