రీసైక్లింగ్‌ చేయలేని ప్లాస్టిక్‌ను నిషేదించాలి

– ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ మార్గాలను ఎతుక్కోవాలి
– అప్పుడే కాలుష్యాన్ని కొంతమేరైనా తగ్గించగలం
– సద్దురు జగ్గీవాసుదేవ్‌
– ఇషా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పర్యావరణ దినోత్సవం
న్యూఢిల్లీ, జూన్‌5(జనం సాక్షి) : ప్లాస్లిక్‌తో పర్యావరణానికి పెనుప్రమాదం పొంచి ఉందని, రీసైక్లింగ్‌ చేయలేని ప్లాస్టిక్‌ను నిషేదించాలని, తద్వారా కొంతమేరైనా కాలుష్యాన్ని తగ్గించగలమని సద్గురు జగ్గీవాసుదేవ్‌, ఐరాస పర్యావరణ విభాగం అధ్యక్షుడు ఎరిక్‌ సోలేహిమ్‌, ఐరాస పర్యావరణ ప్రచార కర్తగా ఉన్న బాలీవుడ్‌ నిటీ దియావిూర్జా అన్నారు. మంగళవారం పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇషా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఢిల్లీలోని కన్నాట్‌ ప్లేస్‌ సెంట్రల్‌ పార్కులో పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యలీ నిర్వహించి మానవాళికి సవాలుగా మారుతున్న ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని నివారించాలని పిలుపునిచ్చారు. అనంతరం జగ్గీవాసుదేవ్‌ మాట్లాడుతూ.. షా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పర్యావరణ దినోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. మానవ జీవనంలో ప్లాస్టిక్‌ ఎలా భాగమైందో అందరికీ తెలుసు అని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు అదే ప్లాస్టిక్‌ మనకు ముప్పుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మనం వినియోగిస్తున్న ప్లాస్టిక్‌లో 40శాతం రీసైక్లింగ్‌ చేయలేమని, రీసైక్లింగ్‌ చేయలేని ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలన్నారు. రీసైక్లింగ్‌ చేసే ప్లాస్టిక్‌ను వినియోగిస్తే కాలుష్యం తగ్గుతుందని జగ్గీవాసుదేవ్‌ పేర్కొన్నారు. ప్యాకింగ్‌ కోసం వాడే ప్లాస్టిక్‌తో ఎక్కువ కాలుష్యం వస్తుందని తెలిపారు. ప్లాస్టిక్‌ ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాలని సూచించారు. అందరూ పర్యావరణానికి సహకరించే సంచులను వాడాలన్నారు. ప్లాస్టిక్‌ కవర్ల తయారీ పరిశ్రమలు కూడా దీనిపై దృష్టి పెట్టాలని చెప్పారు. మానవులకే కాదు, జంతువులకు కూడా ప్లాస్టిక్‌ వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తేనే ప్లాస్టిక్‌ నియంత్రణ సాధ్యమని జగ్గీవాసుదేవ్‌ చెప్పారు.
ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని జయించాలి – ఎరిక్‌ సోలేహిమ్‌
భారత్‌లో ఈ ఏడాది పర్యావరణ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారని ఐరాస ఐరాస పర్యావరణ విభాగ అధ్యక్షుడు ఎరిక్‌ సోలేహిమ్‌ పేర్కొన్నారు. ప్రభుత్వం, ప్రజలు ప్లాస్టిక్‌ నిషేధాన్ని సవాల్‌గా తీసుకోవడం గొప్ప పరిణామం అని ఆయన అన్నారు. భూమి, గాలి, నీరుతో పాటు తినే అన్నింటిలో ప్లాస్టిక్‌ పదార్థాలు కలుస్తున్నాయని తెలిపారు. కలుషితాలు పెరిగిపోయి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని ఎరిక్‌ సోలేహిమ్‌ ఆవేదన వెలిబుచ్చారు. ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని జయించాలన్నారు. రీసైక్లింగ్‌ చేయగలిగిన ప్లాస్టిక్‌నే వినియోగిస్తే సమస్య తీరిపోతుందన్నారు. ప్లాస్టిక్‌ పదార్థాలను తిని జంతువులు, పక్షులు చనిపోతున్నాయని, అందమైన ప్రకృతిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సోలేహిమ్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో షా స్వచ్చంధ సంస్థ నిర్వాహకులు, పర్యావరణ ప్రేమికులు పాల్గొన్నారు.