‘రుజువుల్లేని’ పుస్తకావిష్కరణలో పోరుబిడ్డల ధూంతడాఖా

చిత్తుకాగితంలా చించేసి తగులబెట్టిన్రు
ప్రెస్‌క్లబ్‌ అద్దాలు ధ్వంసం
తెలంగాణ జర్నలిస్టులకు గాయాలు
హౖదరాబాద్‌, ఏప్రిల్‌ 17 (జనంసాక్షి) :
‘రుజువుల్లేని ఉద్యమం’ పేరుతో విశాలాంధ్ర మహాసభ రూపొందించిన పుస్తకావిష్కరణలో తెలంగాణ పోరుబిడ్డలు ధూంతడాఖా చూపిండ్రు. వంద అబద్ధాలతో అచ్చేసిన పుస్తకాన్ని చిత్తుకాగితంలా చించి తగులబెట్టిండ్రు. ఈ పుస్తకావిష్కరణకు ఎలా అనుమతి స్తారంటూ ఏపీయూడబ్ల్యూజేపై మండిపడ్డారు. బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌ అద్దాలు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో పలువురు తెలంగాణ జర్నలిస్టులకు గాయాలయ్యాయి. బుధవారం నగరంలోని బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో రుజువుల్లేని ఉద్యమం పుస్తకావిష్కరణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తెలంగాణ ఉద్యమంపై బురద జల్లేందుకు యత్నిస్తున్నారంటూ తెలంగాణవాదులు పుస్తకావిష్కరణ సభను అడ్డుకున్నారు. వారితో మహాసభ ప్రతినిధులు వాగ్వాదానికి దిగి దాడి చేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు ఇరువర్గాల వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని తెలంగాణవాదులు అడ్డుకుంటారనే సమాచారంతో పోలీసులు ముందుగానే అప్రమత్తమయ్యారు. ఐడీ కార్డులు ఉన్న వారిని, జర్నలిస్టులను మాత్రమే లోనికి అనుమతించారు.

పరకాల వివాదాస్పద వ్యాఖ్యలు

పోలీసుల భద్రత మధ్య మహబూబ్‌ అలీ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మహాసభ ప్రతినిధి పరకాల ప్రభాకర్‌ ప్రసంగిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఉద్రిక్తత తలెత్తింది. తెలంగాణ ఉద్యమం కల్పితమని, వేర్పాటు వాదుల ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. విశాలాంధ్ర బలపడాలనేది తమ ఆకాంక్ష అని, రాష్ట్రం ఒక్కటిగా ఉండాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. తెలుగు జాతి ఐక్యతే లక్ష్యంగా పోరాటం చేస్తున్నామని, కానీ తమపై నిందలు, దాడులు చేస్తూ నోళ్లు నొక్కాలని చూస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రం విడిపోవాలనే భావం తెలంగాణ వాదుల వాదనలు అన్ని అసత్యాలు, అర్ధసత్యాలు, అభూతక కల్పనాలేనని ఆరోపించారు. ఉద్యమం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని, తద్వారా యువకుల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారంటూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అడ్డుకున్న తెలంగాణ వాదులు

తెలంగాణ ఉద్యమంపై ఈ నేపథ్యంలో పరకాల ప్రసంగాన్ని తెలంగాణ జర్నలిస్టులు అడ్డుకున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని కించరపరిచేలా మాట్లాడడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జర్నలిస్టులకు, మహాసభ ప్రతినిధులకు వాగ్వాదం జరిగింది. దీంతో జర్నలిస్టులు తెలంగాణ నినాదాలు చేస్తూ.. ప్రభాకర్‌ ఎదుటే పుస్తకాన్ని చించి, తగలబెట్టారు. మరోవైపు, వారికి పోటీగా మహాసభ ప్రతినిధులు సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న తెలంగాణ న్యాయవాదులు, ఓయూ జేఏసీ ప్రతినిధులు విశాలాంధ్ర నేతలపై మండిపడ్డారు. పుస్తకాలను లాక్కొని పరకాల ప్రభాకర్‌పైకి విసిరికొట్టారు. ఆయనపై దాడి చేసేందుకు యత్నించారు. వారిని మహాసభ ప్రతినిధులు అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట జరిగింది. ఇరువురి ఘర్షణల్లో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో కోపోద్రిక్తులైన కొందరు ప్రెస్‌క్లబ్‌ అద్దాలను ధ్వంసం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు తెలంగాణ వాదులను అదుపులోకి తీసుకున్నారు. భద్రతా వలయం మధ్య పరకాల ప్రభాకర్‌ సహా ఇతరులను అక్కడి నుంచి బయటకు పంపించి వేశారు.