రుణమాఫీపైనే తొలి సంతకం

2014లో అధికారం మాదే
సంతాప తీర్మానంలో తెలంగాణ ఉసేది
పవరిస్తే హామీలన్నీ నెరవేస్తాం : బాబు
హైదరాబాద్‌, మే 27 (జనంసాక్షి) :
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. తొలి సంతకం రుణమాఫీ ఫైలుపైనేనని పునరుద్ఘాటించారు. బెల్టు షాపులు రద్దు చేస్తూ రెండోసంతకం చేస్తామన్నారు. అవినీతి, అసమర్థ, బలహీనమైన ప్రభుత్వాల వల్లే దేశంలో, రాష్ట్రంలో అనేక సమస్యలు నెలకొన్నాయని విమర్శించారు. అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని ధరలు ఆకాశాన్నంటాయని, ప్రజలు అనేక ఇబ్బందులో పడ్డారని తెలిపారు. 2014లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని, ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని చంద్రబాబు ప్రకటించారు. సోమవారం హైదరాబాద్‌ గండిపేటలో ప్రారంభమైన టీడీపీ మహానాడులో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్‌ అవినీతిని ఏకిపారేస్తూ… పార్టీ భవిష్యత్‌పై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. నిరుత్సాహంగా ఉన్న శ్రేణుల్లో స్థయిర్యం నింపేందుకు యత్నించారు. ‘నా రాజకీయ జీవితంలో మరుపురాని ఘట్టం వస్తున్నా విూకోసం పాదయాత్ర.. పాదయాత్రలో కార్యకర్తలే నన్ను నడిపించారు. ఏడు నెలల పాదయాత్రలో ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూశాను. నా ఆలోచనలన్నీ ప్రజల చుట్టూనే తిరిగాయి. కొన్ని రాత్రులు నిద్ర కూడా పట్టలేదు. వారికి న్యాయం చేయాలనే తపన కలిగింది. అందుకే అధికారంలోకి రాగానే వారి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని’ చెప్పారు.

కాంగ్రెస్‌ వల్లే అనర్థాలు

కాంగ్రెస్‌ పార్టీ దుష్ట పరిపాలనతో ఇబ్బందులు వచ్చాయని చంద్రబాబు మండిపడ్డారు. కేంద్ర, రాష్టాల్ల్రో అసమర్థ, అవినీతి పాలన కొనసాగుతోందని ఆరోపించారు. టీడీపీ హయాంలో సమర్థవంతంగా కరెంట్‌ సరఫరా చేశామని, తొమ్మిది గంటలు నాణ్యమైన విద్యుత్‌ అందించామన్నారు. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యుత్‌ వ్యవస్థను భ్రష్టు పట్టించిందని ఆరోపించారు. ప్రజలపై రూ.25 వేల కోట్లు అదనంగా చార్జీల భారం మోపారని, అయినా సరిపడా కరెంట్‌ ఇవ్వడం లేదన్నారు. ‘రాష్ట్రం అంధకారమైంది. పరిశ్రమలు మూతపడుతున్నాయి. వ్యవసాయం దెబ్బ తింది. విద్యుత్‌ కోతల వల్ల 6.30 లక్షల చిన్న పరిశ్రమలు పూర్తిగా మూతపడే పరిస్థితికి వచ్చాయి. 30 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమయ్యే పరిస్థితి నెలకొందని’ ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని చంద్రబాబు విమర్శించారు. రైతుల ఖర్చులు 300 శాతం మేర పెరిగాయని, రాబడి మాత్రం అంతంత మాత్రంగానే ఉందన్నారు. కానీ, కాంగ్రెస్‌ మాత్రం ఎరువుల, విత్తనాల ధరలు పెంచేసిందని, మద్దతు ధర ఇవ్వడంలో విఫలమైందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ నాయకులు తమ కార్యకర్తలను ఆదర్శ రైతులుగా పెట్టుకున్నారని ఆరోపించారు. ‘టీడీపీ హయాంలో సాగునీటి సంఘాలు ఏర్పాటు చేశాం, సాగునీటి కోసం రూ.11 వేల కోట్లు ఖర్చు పెట్టి 35 వేల ఎకరాలకు నీళ్లిచ్చాం. కానీ కాంగ్రెస్‌ జలయజ్ఞం పేరుతో దోపిడీకి పాల్పడింది. రూ.80 వేల కోట్లు ఖర్చు చుక్క నీరు కూడా ఇవ్వలేదని’ ధ్వజమెత్తారు. ‘వ్యవసాయ ఖర్చులు తగ్గించాలి, గిట్టుబాటు ధర కల్పించాలి. మేము అధికారంలోకి రాగానే రైతుల రుణాలను మాఫీ చేస్తాం. కష్టసాధ్యమైన కానీ అసాధ్యమనుకన్న పనిని చేసి చూపిస్తాం. రైతు రుణమాఫీపైనే తొలిసంతకం చేస్తామని’ చెప్పారు. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయని టీడీపీ అధినేత విమర్శించారు. ‘నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఈ ప్రభుత్వానికి ముందుచూపు లేదు. మార్కెటింగ్‌ శాఖ నిర్వీర్యమై పోయింది. అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని’ మండిపడ్డారు. టీడీపీ హయాంలో రైతుబజార్లు పెట్టి రైతులే విక్రయించేలా చూశామని, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించామన్నారు. మార్కెటింగ్‌ శాఖను పటిష్టం చేసి, ధరలు నియంత్రించామని తెలిపారు. ‘కానీ, కాంగ్రెస్‌ హయాంలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. కిరోసిన్‌, చక్కెర కోటా తగ్గించారు. ధరల నియంత్రణలో వైఫల్యం చెందారని’ ధ్వజమెత్తారు.

అమ్మహస్తం కాదది.. మొండిహస్తం

ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మహస్తం మొండి హస్తంగా మారిందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. అమ్మహస్తం మొండి హస్తం అన్న నా వ్యాఖ్యలు నిజమయ్యాయని… తప్పులున్నాయని ముఖ్యమంత్రి, మంత్రులే చెబుతున్నారని పేర్కొన్నారు. ఎప్పటిలోగా తప్పులు సరిదిద్దుతారని ప్రశ్నించారు. అమ్మహస్తం పేరుతో పనికి మాలిన వస్తువులు సరఫరా చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో 35 లక్షల గ్యాస్‌ కనెక్షన్లు మంజూరు చేశామని, కానీ ఇప్పుడే కనెక్షన్లు ఇవ్వడం లేదని, గ్యాస్‌ ధర పెంచేశారని మండిపడ్డారు. చివరకు ప్రజలకు మంచినీళ్లు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. కానీ, కావాల్సినంత మద్యం మాత్రం సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. ‘గ్రావిూణ ప్రాంతాల్లో మంచినీళ్లు ఇవ్వట్లేదు, ఇళ్లు కట్టివ్వలేదు. మరుగుదొడ్లు నిర్మించలేదు. కానీ, వీధికో మద్యంషాపులు మాత్రం తెరుస్తున్నారు. పేదల జీవితంతో, ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. ఇది ప్రజా ప్రభుత్వం కాదు.. ప్రజల రక్తం తాగే ప్రభుత్వమని’ దుయ్యబట్టారు. మద్యం మాఫియా ఏర్పాటు చేసి, రాష్ట్రంలో మద్యాన్ని వరదలా పారిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి రాగానే బెల్టుషాపులు రద్దు చేస్తామని పునరుద్ఘాటించారు. రెండో సంతకం అదే ఫైలుపై ఉంటుందన్నారు. తనను చూసి ముఖ్యమంత్రి బెల్టుషాపులు రద్దు చేస్తామంటున్నాడని ఎద్దేవా చేశారు. సీఎం కిరణ్‌కు చిత్తశుద్ది ఉంటే వెంటనే బెల్టుషాపులు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ హయాంలో ఎన్టీఆర్‌ సుజల స్రవంతి కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామానికి తాగునీటిని సరఫరా చేశామని, విద్యకు అధిక ప్రాధాన్యమిచ్చామన్నారు. చదువుకున్న వారందరికీ ఉపాధి కల్పించామని, కానీ, ఇప్పుడు చదువుకు ప్రోత్సాహం లేదు. ఉద్యోగాలు కల్పించే అవకాశం లేదని ఆరోపించారు. ప్రజలపై మాత్రం విపరీతమైన విపరీతమైన భారం మోపారని ధ్వజమెత్తారు. దేశంలో ఎక్కడ లేనటువంటి పన్నుల భారం ఇక్కడే ఉందన్నారు. మూడేళ్లుగా స్థానిక సంస్థలకు, మునిసిపాలిటీలకు ఎన్నికలు నిర్వించలేదని, క్షేత్ర స్థాయిలో జవాబు చెప్పే పరిస్తితి లేదన్నారు.

అంతా అవినీతే..
కాంగ్రెస్‌ పాలన అంతా అవినీతిమయమేనని చంద్రబాబు విమర్శించారు. ఆనాటి వైఎస్‌ నుంచి నేటి కిరణ్‌ వరకూ అందరూ తమకు కావాల్సిన వారికి భూములను దోచిపెట్టారని మండిపడ్డారు. ‘ప్రభుత్వ భూములను మొత్తం దోచేశారు. ప్రజల ఆస్తులను కొల్లగొట్టారు. భూములు, గనులు, నీటిని దోచుకున్నారు. రైతుల భూములను కారుచౌకగా కొట్టేసి పెత్తందార్లకు కట్టబెట్టారని’ ఆరోపించారు. మద్యం మాఫీయా, ఇసుక మాఫీయా ఏర్పాటై ప్రభుత్వ సొత్తును కొల్లగొడుతున్నారని విమర్శించారు. వైఎస్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడి లక్ష కోట్లు దోచుకున్నాడని ఆయన బతికి ఉన్నప్పుడే తాము చెప్పామని… ఇప్పుడు అదే నిజమైందన్నారు. ఇప్పుడు సీబీఐ వేస్తున్న చార్జిషీట్లతో మేం చెప్పింది వాస్తవమేనని తేలిపోయిందని, తన తనయుడికి వేల కోట్లు దోచిపెట్టాడని చార్జిషీట్లలో వెల్లడైందన్నారు. రూ.43 వేల కోట్లు దోచుకున్నట్లు సీబీఐ తేల్చిచెప్పిందన్నారు. సీఎం, మంత్రులంతా కలిసే అవినీతికి పాల్పడ్డారని.. కానీ ఇప్పుడేమో ఒకరినొకరు బ్లాక్‌మెయిల్‌ చేసుకుంటూ కేసుల నుంచి బయటపడేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ‘కాంగ్రెస్‌ పార్టీ దొంగల రైలు. ఆ రైలుకు డ్రైవర్‌ (సీఎం) మాత్రమే మారారు తప్ప .. దొంగ మంత్రులు మారలేదని’ వ్యాఖ్యానించారు. కేసుల నుంచి బయటపడేందుకు మంత్రులు ఇప్పుడు తమకేవిూ తెలియదంటున్నారని… ఏవిూ తెలియకుండానే సంతకాలు చేశారా? అని ప్రశ్నించారు. ‘మాకు ఏవిూ తెలియకుండా సంతకం చేశామని మంత్రులు చెబుతున్నారు. విూకు తెలియకుండానే సంతకాలు చేశారా? విూకు ఏమి రాకుండానే సంతకాలు పెట్టారా?’ అని నిలదీశారు. ఏమి తెలియనప్పుడు మేం అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. వైఎస్‌ అవినీతిని సమర్థించిన కిరణ్‌ కూడా అవినీతిపరుడేనని మండిపడ్డారు. సీఎం సిగ్గులేకుండా అవినీతికి పాల్పడిన మంత్రులకు న్యాయం చేస్తున్నాడన్నారు. కళంకిత మంత్రులకు ఆర్థిక సాయం చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు.

అవినీతిలో మంత్రులు
కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వమని.. ఒక మంత్రి ఏ4గా, మరో  మంత్రి ఏ5గా ఉన్నారని, ఇంకో మంత్రి జైలులో ఉన్నారన్నారు. మరో మంత్రి ఫెమా ఉల్లంఘన కేసులు దోషిగా శిక్ష ఎదుర్కొంటున్నాడని మండిపడ్డారు. కళంకిత మంత్రులను తొలగించాలని టీడీపీ అలుపెరుగని పోరాటం చేస్తుందన్నారు. ఇందకోసం క్షేత్రస్థాయిలో, అసెంబ్లీలో పోరాడామని, గవర్నర్‌ను కలిసి వారిని తొలగించాలని కోరామన్నారు. చివరకు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని కూడా కలిశామని… తాము చేసిన పోరాటం ఫలితంగా రెండు వికెట్లు పడ్డాయని సబిత, ధర్మాన ప్రసాదరావుల రాజీనామాలనుద్దేశించి వ్యాఖ్యానించారు. అవినీతి విషయంలో రాజీ పడబోమని, దీనిపై ఎన్టీఆర్‌ నుంచి ఇప్పటివరకూ పోరాడుతున్నామన్నారు. అవినీతిని అంతం చేసే వరకూ, అవినీతి మంత్రులను ఇంటికి పంపే వరకూ, దోచుకున్న డబ్బును తిరిగి కక్కించే వరకూ పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ అవినీతి వల్ల మంత్రులు, ఐఏఎస్‌ అధికారులు, పారిశ్రామిక వేత్తలు జైలుపాలయ్యారని ఆరోపించారు. ఈ రోజు బ్లాక్‌ డే అని వైఎస్సార్‌సీపీ నాయకురాలు చెబుతున్నారని… విూ కుటుంబం వల్ల ఐఏఎస్‌ అధికారులు, మంత్రులు, వ్యాపారవేత్తలు జైలు పాలయ్యారు. దానికి విూ సమాధానమేంటని ప్రశ్నించారు. విూ కుటంబం వల్ల చాలా కుటుంబాలు నాశనమైపోయాయి.. వారికేం సమాధానం చెబుతారన్నారు. ఎవరైనా వైఎస్సార్‌సీపీలో చేరాలంటే చంచల్‌గూడ జైలుకు వెళ్లి కలుస్తున్నారని.. జైలులో దర్శనం చేసుకొని పార్టీలో చేరుతున్నారంటే.. వారికి ఏం విలువలు ఉన్నట్లు అని ప్రశ్నించారు. దోచుకున్న డబ్బుతో పేపర్‌, టీవీ పెట్టి దుష్పచ్రారం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.రాష్ట్రంలో అవినీతిపై ఢిల్లీ స్థాయిలో పోరాటం చేశామన్నారు. రాజా ఆఫ్‌ కరప్షన్‌, మైనింగ్‌ మాఫియా పుస్తకాలు వేశామని,  దేశవ్యాప్తంగా ప్రచారం చేశామని తెలిపారు. కానీ, కేంద్రం, కాంగ్రెస్‌ స్పందించలేదని… చివరికు సుప్రీంకోర్టు, కోర్టులు, లోకాయుక్త చర్యలు తీసుకున్నాయన్నారు. కేంద్రంలో అసమర్థ ప్రభుత్వం ఉందని బాబు మండిపడ్డారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు 17సార్లు పెంచారని, ఎరువులు, గ్యాస్‌ ధరలు పెంచేశారని, పన్నులు, సర్వీస్‌ పెంచేసి, సబ్సిడీలు ఎత్తేశారని ధ్వజమెత్తారు. అసమర్థ నాయకత్వం వల్ల 2జీ, బొగ్గు, ఆదర్శ్‌, హెలికాప్టర్ల కుంభకోణాలు చోటు చేసుకున్నాయని మండిపడ్డారు. కేంద్రంలో బలహీనమైన, పనికిమాలిన ప్రభుత్వం ఉందని దేశ రాజధానిలో ఆడవారికి రక్షణ లేకపోయిందన్నారు. టీడీపీ హావిూ ఇచ్చిన నగదు బదిలీ పథకాన్ని కాపీ కొట్టారని ఆ పథకాన్ని నకిలీ పథకంగా మార్చేశారని ధ్వజమెత్తారు.

టీడీపీ కంటే మెరుగైన పాలన అందిస్తారని, మంచి చేస్తారని భావించి ప్రజలు ఓట్లు వేస్తే లక్షల కోట్లు దోచుకున్నారని, కానీ ప్రజల నమ్మకన్ని కాంగ్రెస్‌ వమ్ము చేసిందన్నారు. కాంగ్రెస్‌, వైఎస్సార్‌సీపీలను చిత్తుచిత్తుగా ఓడించి రాష్టాన్న్రి రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీని భూస్థాపితం చేస్తామన్న గాలి జనార్దన్‌రెడ్డి అడ్రస్‌ లేకుండా పోయాడని తెలిపారు. అప్పట్లో వైఎస్‌ కూడా చాలా మాట్లాడాడని, వెయ్యి మంది వైఎస్‌లు వచ్చినా టీడీపీని ఏవిూ చేయలేరన్నారు. ‘నా విూద కేసులు పెట్టాడు, కోర్టుకెళ్లాడుపార్టీని దెబ్బ తీసేందుకు యత్నించాడు.. నిప్పులా బతికాం, అందుకే ఎవరు ఏవిూ చేయలేక పోయారని’ వ్యాఖ్యానించారు. పార్టీ నుంచి ఒకరిద్దు నేతలను లాక్కుంటే మేం భయపడతామా? అని ప్రశ్నించారు. నాయకులు పార్టి వీడినా.. కార్యకర్తలు అండగా ఉన్నారని.. కార్యకర్తల రుణం తీర్చుకుంటామన్నారు.సీఎం కిరణ్‌ పాలన అవినీతిమయంగా మారిందన్నారు. కిరణ్‌ ప్రభుత్వం ప్రజల రక్తంతాగే ప్రభుత్వంగా మారిందని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఒక తమ్ముడ్ని, చిత్తూరులో మరో తమ్మడ్ని పెట్టి డబ్బు దోచుకుంటున్నారని విమర్శించారు. కిరణ్‌ మాటలు కోటలు దాటుతున్నాయని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌, అమ్మహస్తం, బంగారుతల్లి పథకాలు ఉత్తివేనని ఆ పార్టీ వారే చెబుతున్నారని ఎద్దేవా చేశారు. బంగారుతల్లి పథకం ప్రభుత్వంలోనే కుంపట్ల తల్లిగా మారిందన్నారు. సన్నబియ్యం ఇస్తామని చెప్పారని, దొడ్డుబియ్యాన్ని మరోసారి పాలిష్‌ చేసి సరఫరా చేస్తున్నారని విమర్శించారు.
వైఎస్సార్‌సీపీ జైలు పార్టీగా మారిందని, టీఆర్‌ఎస్‌ కలెక్షన్ల పార్టీగా మారిందని బాబు విమర్శించారు. తెలంగాణపై 2008లోనే స్పష్టమైన వైఖరి చెప్పామన్నారు. అధికారంలోకి రాగానే ప్రాంతీయ ఉద్యమంలో పెట్టిన కేసులన్నంటినీ రద్దు చేస్తామని ప్రకటించారు. రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలదే హవా అని తెలిపారు. కేంద్రంలో తృతీయ కూటమి అధికారంలోకి వస్తుందని, జాతీయ స్తాయిలో మరోసారి చక్రం తిప్పుతామన్నారు. 2014లో టీడీపీదే ఘన విజయమని అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.