రుణాల మంజూరులో రైతులకు సవాలక్ష నిబంధనలు
గుంటూరు,జూలై10(జనం సాక్షి): రైతులకు రుణాలు మంజూరు చేసేందుకు లక్ష నిబంధనలు విధిస్తున్నారని రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి పి.కోటేశ్వరరావు మండిపడ్డారు. రుణాలు తీసుకుని చెల్లించని బడా బాబులకు మళ్లీ రుణాలివ్వడం దుర్మార్గమన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థ పాలక వర్గాల చేతిలో పనిముట్టుగా మారిందని ఎద్దేవా చేశారు. ఏపీలో పండిన పంటల్లో పత్తి మినహా ఏ పంటకు గిట్టుబాట ధర ఉండటం లేదన్నారు. దేశంలోని మిగతా రాష్టాల్లోన్రూ ఇదే పరిస్థితి నెలకొందన్నారు. మిర్చి ఎక్కువగా పండి దిగుబడి వచ్చినా గిట్టు బాటు ధర విషయమై పాలకులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. గత ప్రభుత్వ విధానాలను మాని వెంటనే రైతులను ఆదుకోవాలని కోరారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయకపోగా రైతులు వ్యవసాయ భూములను వదులుకునే సంస్కరణలు తీసుకొస్తున్నారని మండిపడ్డారు. భూములన్నీ కార్పొరేట్ శక్తుల ఆధీనంలోకి తేవాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. స్వామినాధన్ కమిషన్‌ను
వేసిన అప్పటి ప్రభుత్వం దాన్ని అమలు చేయలేదని, అమలు చేయమని అప్పట్లో డిమాండ్ చేసిన ప్రస్తుత ప్రభుత్వం కూడా అమలు చేయడంలేదని విమర్శించారు. సీఎం చంద్రబాబు దానిపై ఊసెత్తడంలేదని విమర్శించారు.రైతులు పండించిన పంటలు అన్నింటికి న్యాయమైన ధర యిచ్చి సకాలంలో ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలావుంటే రుణ ప్రణాళికలో కౌలురైతులకు రూ.3 వేల కోట్లు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిలాలో ఏ బ్యాంకుకు వెళ్లినా కౌలు రైతులకుమొండిచెయ్యి చూపుతున్నారని అన్నారు. ప్రభుత్వం బ్యాంకర్లకు తగిన ఆదేశాలు ఇచ్చి రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.