రూ. 6లక్షల కోట్ల ముద్రా రుణాలు

– 12కోట్ల మందికి లబ్ధి చేకూరింది
– ప్రధాని నరేంద్రమోడీ వెల్లడి
న్యూఢిల్లీ, మే29(జ‌నం సాక్షి) : ప్రధానమంత్రి ముద్రా యోజన(పీఎంఎంవై) పథకం కింద ఇప్పటివరకు 12కోట్ల మంది లబ్ధిపొందినట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. మంగళవారం ఆయన  ముద్రా లబ్ధిదారులతో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఈ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఈ పథకం ద్వారా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రూ. 6లక్షల కోట్ల రుణాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.12కోట్ల మంది లబ్ధిదారుల్లో 28శాతం అంటే 3.25కోట్ల మంది తొలిసారిగా వ్యాపారంలోకి అడుగుపెట్టినవారేనని మోదీ తెలిపారు. ఇక 74శాతం అంటే 9కోట్ల మంది మహిళలు ముద్రా రుణాలు తీసుకున్నట్లు చెప్పారు. వీరిలో సగానికి పైగా మహిళలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందినవారేనని తెలిపారు. ‘కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే లేదా వ్యాపారాలను విస్తరించుకోవాలనుకుంటున్న యువత, మహిళలకు ఈ ముద్రా
యోజన సరికొత్త అవకాశాలు కల్పిస్తోంది. దీంతో పాటు ఉపాధిని కూడా అందిస్తోంది’ అని ఈ సందర్భంగా మోదీ అన్నారు. ప్రధానమంత్రి ముద్రా యోజన పథకాన్ని 2015 ఏప్రిల్‌ 8న ప్రారంభించారు. ఈ పథకం కింద కార్పొరేటేతర వ్యక్తులు తమ వ్యాపార అవసరాల కోసం బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రూ. 10లక్షల వరకు రుణాలు తీసుకోవచ్చు.
———————————–