రెండు అధికార కేంద్రాలు లేవు
అది మీడియా సృష్టే రాహుల్ వస్తానంటే నేనొద్దంటానా?
ప్రధాని మన్మోహన్‌సింగ్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 5 : ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఎప్పుడు ముందుకు వచ్చినా తాను స్వాగతిస్తానని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ప్రధాని పదవి చేపట్టే విషయంలో రాహుల్‌దే తుది నిర్ణయమని ఆయన చెప్పారు. మూడోసారి తాను ప్రధానమంత్రిగా కొనసాగుతానన్నది ఊహాజనితమైన ప్రశ్నగా ప్రధాని కొట్టిపారేశారు. ‘ గ్రీన్ నేషనల్ అకౌంటింగ్’ పై జరిగిన సదస్సులో పాల్గొనేందుకు శుక్రవారం నాడు వచ్చిన సందర్భంగా ప్రధానిని పలువురు విలేకరులు కలిశారు. ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నలకు ఆయన పై విధంగా జవాబిచ్చారు. తాను మూడోసారి కూడా ప్రధానిగా కొనసాగాలనుకుంటున్నట్టు వచ్చిన వార్తలన్నీ మీడియా సృష్టేనని ప్రధాని అన్నారు. ప్రధాని కావడానికి రాహుల్‌కు ఎలాంటి అడ్డంకులు లేవన్నారు. ఎప్పుడు వచ్చినా హృదయపూర్వకంగా స్వాగతిస్తామన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో రాహుల్ గాంధీ ప్రసంగం భేషుగ్గా ఉందన్నారు. దేశం పట్ల ఆయనకు ఉన్న దూరదృష్టి, నిబద్ధత ఆయన ప్రసంగంలో ద్యోతకమయ్యాయన్నారు. కాంగ్రెస్ పార్టీలో రెండు అధికార కేంద్రాలున్నాయన్న అంశంపై ప్రశ్నించగా ఇది అనవసరమైన చర్చ అని ప్రధాని వ్యాఖ్యానించారు. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ ప్రధాని, సోనియా గాంధీల సంబంధాలు రెండు అధికార కేంద్రాలుగా ఉన్నట్టు ఉన్నాయని, ఇది విఫల ప్రయోగమని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే దీనిని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. వీరిద్దరి నాయకత్వం ఆదర్శవంతమైనదని పార్టీ పేర్కొంది.