రెండు నెలల్లోపు ఉక్కు పరిశ్రమపై..

కేంద్రం నిర్ణయం తీసుకోవాలి
– కేంద్రం ముందుకొస్తే సగం వాటా భరిస్తాం
– లేకుంటే రాష్ట్రమే ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది
– ఏపీకి అన్యాయం చేస్తే ఖబడ్దార్‌.. వదిలే ప్రసక్తే లేదు
– గాలి జనార్దన్‌ రెడ్డి, జగన్‌లతో కలిసి బీజేపీ నాటకాలు ఆడిస్తోంది
– ఉత్తరాంధ్ర ప్రజలను పవన్‌ రెచ్చగొడుతున్నాడు
– ఓ పూజారి మాటలతో తిరుమల ప్రతిష్టను బజారుకీడ్చుతున్నారు
– ఉక్కుకోసం దీక్షలు చేస్తుంటే అవహేళన చేస్తున్నారు
– ఇదేనా రాష్ట్రం కోసం విూరు చేసేది
– రాజీనామాలు చేసి కూర్చోవటం కాదు.. పోరాడి సాధించుకోవాలి
– రమేష్‌, రవిల దీక్ష చరిత్రలో నిలిచిపోతుంది
– ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
– రమేష్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేసిన సీఎం
– ఉద్యమం ఇంతటితో ఆగదు.. సాధించే వరకు ఊరుకోమన్న చంద్రబాబు
కడప, జూన్‌30 (జ‌నం సాక్షి) : రెండు నెలల్లోపు ఉక్కుపరిశ్రమపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని, లేకుంటే కేంద్రం మెడలు వంచి సాధించుకుంటామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఉక్కు పరిశ్రమ కోసం నిరాహార దీక్ష చేస్తున్న ఎంపీ రమేష్‌ను శనివారం సీఎం పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఉక్కు సంకల్పంతో ముందుకొచ్చిన అందరికీ అభినందనలు తెలిపారు. ఆరోగ్యం బాగాలేకున్నా బీటెక్‌ రవి ఏడురోజులు దీక్ష చేశారని, సీఎం రమేష్‌ ఆరోగ్యం క్షీణించిందన్నారు. నాలుగైదు రోజులు కూడా దీక్ష చేయలేని నేతలు సీఎం రమేష్‌ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. దీక్షలపై అనవసరమైన విమర్శలు మానుకోవాలని సీఎం అన్నారు. అనంతరం సీఎం రమేష్‌కు నిమ్మసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. అంతకు ముందు సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు కోసం ఆనాడు ఆంధ్రులు పోరాడి విజయం సాధించామని, విశాఖ స్టీల్‌ఫ్యాక్టరీకి రాష్ట్ర ప్రభుత్వం 19వేల ఎకరాలు ఇచ్చిందని గుర్తుచేశారు. సాధ్యాసాధ్యాలు పరిశీలించి కడపలో ప్లాంట్‌ పెట్టాలని చట్టంలో ఉన్నా కేంద్ర ప్రభుత్వం ఇంతకాలం కాలయాపన చేసిందని విమర్శించారు. ఆరునెలల్లో ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉందని పేర్కొన్నారు. కడప జిల్లాకు ఉక్కు ఫ్యాక్టరీని సాధించి తీరతామని స్పష్టం చేశారు. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని మెకాన్‌ సంస్థ నివేదిక ఇచ్చిందని తెలిపారు. కేసుల కోసం లాలూచీపడి రాష్ట్ర భవిష్యత్‌ను తాకట్టుపెడుతున్నారని సీఎం ఆరోపించారు. కడప స్టీల్‌ఫ్యాక్టరీకి అన్ని వసతులు కల్పిస్తామని కేంద్రానికి చెప్పామన్నారు. గండికోటకు నీరు తీసుకొచ్చామని ఇప్పుడు నీటి కొరత కూడా లేదని తెలిపారు. 15కి.విూ. దూరంలో హైవే, రైల్వేలైన్‌ ఉందని సీఎం తెలిపారు. అందరూ సంఘటితంగా ఉంటేనే కేంద్రం దిగి వస్తుందని చంద్రబాబు సూచించారు. ఏపీకి అన్యాయం చేస్తే ఖబడ్దార్‌.. వదిలే ప్రసక్తే లేదని, 5 కోట్ల ఏపీ ప్రజల తరఫున డిమాండ్‌ చేస్తున్నామన్నారు. రెండు నెలల్లోపు ఉక్కు పరిశ్రమపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని,  కేంద్రం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తే సగం ఖర్చు భరిస్తాంమని, కేంద్రం ముందుకు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు అన్నారు.
ఏదేమైనా ఓ కమిటీ వేస్తామని, కేంద్రంతో మాట్లాడతామని, పార్లమెంట్‌లో పోరాడతామని చంద్రబాబునాయుడు అన్నారు. వైసీపీ, జనసేన, బీజేపీలపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. బీజేపీకి ఓ వైపు జనసేనాని పవన్‌ కల్యాణ్‌, మరోవైపు వైసీపీ అధినేత జగన్‌లు ఉన్నారంటూ సీఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు. అలాగే ఉత్తరాంధ్రలో ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం కోసం పోరాడతానంటోన్న పవన్‌ మాటల్లో ఏమైనా అర్థం ఉందా అని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీకి కంచుకోట.. విశాఖపట్నంను అభివృద్ధి చేసిన ఘనత తమదేనని అన్నారు. అలాంటి ఉత్తరాంధ్రలో పవన్‌ కల్యాణ్‌ ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని తూర్పారబట్టారు. గాలి జనార్దన్‌ రెడ్డి, జగన్‌లతో కలిసి బీజేపీ నాటకాలు ఆడిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. జగన్మోహన్‌ రెడ్డి తన తమ్ముడని గాలి జనార్దన్‌ రెడ్డి అంటున్నారు… ఈ అన్నదమ్ములు ఇద్దరి సంగతి ఏంటో అందరికీ తెలుసని బాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైయస్‌ హయాంలో గాలి జనార్దన్‌ రెడ్డితో బ్రాహ్మణి స్టీల్స్‌ ఏర్పాటుచేయడానికి ప్రయత్నం జరిగిందని అన్నారు.
విపపక్ష నేతలు చివరకు తిరుమల వేంకటేశ్వరస్వామితో కూడా ఆడుకుంటున్నారని ముఖ్యమంత్రి విమర్శించారు. శ్రీవారికి పింక్‌ డైమండే లేదని, ఓ పూజారి చెప్పే మాటలకు జగన్‌, జనసేనానిలు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. వీళ్ల నిర్వాకం వల్లే తిరుమలను తామెందుకు స్వాధీనం చేసుకోకూడదంటూ ఆర్కియాలజీ డిపార్ట్‌ మెంట్‌ లేఖ రాసే పరిస్థితి వచ్చిందని అన్నారు. స్వామివారి నగలన్నీ లెక్కల ప్రకారమే భద్రంగా ఉన్నాయని, వీళ్లు మాత్రం మాయమైపోయాయని అంటున్నారని విమర్శించారు. తనపై తప్పుడు ప్రచారం చేయడమే వీరి పని.. ఇబ్బందులు ఉన్నా ఎన్నో అభివృద్ధి పనులు చేశానని చెప్పారు. ఏపీని దేశంలోనే నెంబర్‌ చేసే బాధ్యతను తాను తీసుకున్నానని దీనికి ప్రజలంతా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్‌, ఇతర మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు.