రెండేళ్ల క్రితం బాలుడు కిడ్నాప్‌

అస్తిపంజరం రూపంలో లభ్యం

ఢిల్లీలో వెలుగు చూసిన ఘటన

న్యూఢిల్లీ,జూన్‌4(జ‌నం సాక్షి ): సుమారు రెండేళ్ల క్రితం అపహరణకు గురైన బాలుడు అస్థిపంజరం రూపంలో చిక్కాడు. చెక్కపెట్టెలో అస్తిపంజరం లభ్యమైన దారుణ ఘటన రాజధాని దిల్లీ నగరంలో వెలుగు చూసింది. దాదాపు 18 నెలల క్రితం నగరంలోని సహీబాబాద్‌ ప్రాంతంలో 2016 డిసెంబరు ఒకటో తేదీన మహమ్మద్‌ జైద్‌ అనే బాలుడు అపహరణకు గురయ్యాడు. ఆ తరవంఆత నుంచి అతడి ఆచూకీ లభించలేదు. పోలీసుల గాలించిన లాభం లేకపోయింది. ఆ తర్వాత రూ.8లక్షలు డిమాండ్‌ చేస్తూ బాలుడి తండ్రికి నిందితుల నుంచి ఫోన్‌ వచ్చింది. దీనిపై బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ జరిపి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. కానీ బాలుడి ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. కాగా సహీబాబాద్‌ ప్రాంతంలోని బాలుడి ఇంటికి సవిూపంలోనే ఓ ఇంటి డాబాపై అస్థిపంజరం ఓ చెక్క పెట్టెలో లభ్యమైంది. గరిమా గార్డెన్‌ ప్రాంతంలో వీధిలో పిల్లలు క్రికెట్‌ ఆడుకుంటుండగా బంతి సవిూపంలోని ఇంటిపై పడింది. దీంతో పిల్లలు బంతి కోసం డాబా ఎక్కారు. అక్కడ చెక్క పెట్టె, అందులో చిన్నారి అస్థికలను వారు గుర్తించి స్థానికులకు తెలిపారు. ఆ పిల్లల్లో జైద్‌ అన్నయ్య కూడా ఉన్నాడు. జైద్‌ తండ్రి ఆ అస్థికలను పరిశీలించారు. పెట్టెలోని దుస్తుల ఆధారంగా జైద్‌ తండ్రి బాలుడిని కనిపెట్టారని, ఆ దుస్తులను జైద్‌ స్కూల్‌ యూనిఫాంగా గుర్తించారని పోలీసులు తెలిపారు. బాలుడి అస్థికలను శవపరీక్ష, డీఎన్‌ఏ పరీక్షల నిమిత్తం పంపించినట్లు వెల్లడించారు. పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు.