రెండేళ్ల పాలన సమైక్యవాదమే…
కిరణ్‌కుమార్‌రెడ్డి రెండేళ్ల పాలన సీమాంధ్ర ప్రాంతంవైపే పరుగులు పెట్టింది. 2010 నబంబర్ 24న ప్రమాణస్వీకారం చేసిన ఆయన నేనూ హైదరాబాదీనే అంటూ పదే పదే ప్రకటనలు గుప్పించే కిరణ్‌సారు చూపంతా సొంత జిల్లా చిత్తూరు వైపు, సీమాంధ్ర ప్రాంతంవైపు మాత్రమే ఉంది. హైదరాబాద్‌లోనే పుట్టానని, ఇక్కడే చదువుకున్నానని చెప్పే క్రికెటర్ కిరణ్ పాలనలో సింగిళ్లకు ప్రాధన్యత ఇవ్వకుండా సిక్సర్లు, బౌండరీలకే పరిమితమయ్యాడు. ఫలితంగా హైదరాబాద్ సహా తెలంగాణలోని అన్ని జిల్లాలు అభివృద్ధి లో వెనుకబడ్డాయి. రాష్ట్రంలోని పరిస్థితుల అధ్యయననానికి కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ సమస్యను మొదటికి తెచ్చింది. ఇందుకు కిరణ్, సీమాంధ్రలోని పెట్టుబడిదారులే కారణం. కమిటీ సూచించిన ఎనిమిదో చాప్టర్ అమలుకు సీఎం చురుకుగా పావులు కదిపారు. తెలంగాణ ప్రాంత మంత్రులను ఎలాగోలా మచ్చిక చేసుకున్నారు. మరికొందరికి పదవులు ఎరగా చూపి తెలంగాణవాదులపై ఎదురుదాడికి దిగారు. సకల జనుల సమ్మె సందర్భంగా రైలురోకోలో పాల్గొంటామని ప్రకటించిన సొంతపార్టీ ఎంపీలనే అరెస్టు చేయించి జైలుకు పంపారు. సకుల జనుల సమ్మెతో తెలంగాణ ప్రాంత జనజీవనం పూర్తిగా స్తంభించినా నీరో చక్రవర్తిలా చోద్యం చూశారే తప్ప ప్రజల ఆకాంక్షను గౌరవించలేదు. చివరికి కేంద్రమే జోక్యం చేసుకుని సమ్మెకు పుల్‌స్టాప్ పెట్టిచింది. ఆ సమయంలో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరున్నా జలవిద్యుత్ ఉత్పత్తి చేయకుండా ఉద్దేశ్యపూర్వకంగానే తెలంగాణ ప్రాంతంలో విద్యుత్ కోతలు విధించారు. సమ్మె తర్వాత కూడా బొగ్గు లభ్యత తగ్గిందని చెప్తూ రైతంగానికి కోతలు పెంచారు. పంటలు ఎండిపోయి పెట్టుబడి కోల్పోయినా కనీసం ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు మొగ్గుచూపలేదు. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలతో ప్రాణహిత, పెన్‌గంగా నదులు ఉప్పొంగి వేలాది ఎకరాల్లో రైతుల పంటలు కొట్టుకుపోయినా అడ్డగోలు నిబంధనలతో వారికి పరిహారం దక్కకుండా చేశారు. అదే ఆంధ్ర ప్రాంతంలో తుఫాను కారణంగా పంటలు కోల్పోయిన రైతులకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించారు. ఇలా తెలంగాణ రైతులపై తీవ్ర వివక్ష ప్రదర్శించారు. టీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన సాగరహారానికి పిలుపునిచ్చినట్టే ఇచ్చే పోలీసుల నిర్బంధాలతో ప్రజలు హైదరాబాద్‌కు వెళ్లకుండా అడుగడుగునా అడ్డుకున్నారు. అయినా ప్రజలు లక్షలాదిగా తరలివచ్చి సాగరహారాన్ని విజయవంతం చేశారు. అదే సమయంలో పోలీసులు ప్రయోగించిన భాష్పవాయు గోళాలు తగిలి గాయపడిన రాజిరెడ్డి చికిత్స పొందుతూ మృతిచెందాడు. అడ్డగోలు ప్రకటనలతో ఎందరో విద్యార్థులు, యువకులు ఆత్మహత్యలకు కారకుడైన కిరణ్ మార్చ్‌ల్లో పాల్గొన్న ఒకరిని బలితీసుకున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీవవైవిధ్య సదస్సు ఏర్పాట్లలో ఘోరంగా విఫలమై ప్రపంచ దేశాల ఎదుట తలెత్తుకోకుండా చేశారు. సదస్సుకు వచ్చిన ప్రధాని మన్మోహన్‌సింగ్ సమావేశానికి తెలంగాణ మీడియా ప్రతినిధులను ఆహ్వానించకుండా అడ్డుకున్నారు. తనకు అన్ని ప్రాంతాలు సమానమేనని చెప్తూనే తెలంగాణ మీడియాపై కావాలని వివక్ష చూపారు. హంద్రీనీవా ప్రాజెక్టుకు ప్రత్యేక నిధులిచ్చి పూర్తి చేయించారు. అదే తెలంగాణ ప్రాజెక్టులకు భిక్షం వేసినట్లుగా అరకొర నిధులు విదిల్చారు. 610 జీవో అమలు చేయాలని హై కోర్టు ఆదేశించినా ఇప్పటి వరకు కనీస చర్యలు చేపట్టలేదు. కరీంనగర్‌కు మంజూరైన సైనిక్ స్కూల్‌ను చిత్తూర్ జిల్లాకు తరలించాడు. ఇప్పటికే సీమాంధ్ర ప్రాంతంలోని కోరుకొండలో సైనిక్‌స్కూల్ ఉన్నా తెలంగాణ ప్రాంతానికి కావాలనే అన్యాయం చేశారు. ఎమ్మెల్యేకు అభివృద్ధి నిధులు కేటాయించడంలోనూ వివక్ష చూపారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే రాజ్యయ్య తెలంగాణ సాధన కోసం రాజీనామా చేసి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీకి సిద్ధపడినా మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మంత్రి డీకే అరుణ, వరంగల్ జిల్లాకు చెందిన ప్రభుత్వ విప్ గండ్ర వెంకటరమణారెడ్డిని స్థాకంగానే ఉంచి కృష్ణారావును ఓడించాలని ప్రయత్నించాడు. అయినా ప్రజలు వారికే బ్రహ్మరథం పట్టారు. టీఆర్‌ఎస్‌కు ఎమ్మెల్యేలు, తెలంగాణ నగరా సమితి అధ్యక్షుడు నాగం జనార్దన్‌రెడ్డిని ప్రజలు ఉప ఎన్నికల్లో ఆశీర్వదించినా తెలంగాణపై తన వైఖరిని మార్చుకోలేదు. అవకాశం చెక్కినప్పుడల్లా తెలంగాణవాదం లేదంటూ తప్పుడు రిపోర్టులు ఇవ్వడానికే మొగ్గు చూపారు. ఇక్కడి విద్యార్థులు తమ ఆకాంక్ష తెలిపేందుకు ఆత్మబలిదానాలు చేస్తున్నా కనీసం విచారం వ్యక్తం చేయలేదు. సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల్‌లో నేత కార్మికులు, పంటలు కోల్పోయి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా కనీసం ఆ కుటుంబాలకు సానుభూతి కూడా తెలుపలేదు. హైదరాబాదీ కెప్టెన్ పాలనలో తెలంగాణ తీవ్ర వివక్షను ఎదుర్కొని ఆపన్నహస్తం అందించేవారి కోసం ఎదురుచూస్తోంది.