రెండో జాబితాలోనూ పొన్నాలకు మొండిచేయి
మండిపడుతున్న కాంగ్రెస్ నేతలు
జనగామ,నవంబర్14(జనంసాక్షి): కాంగ్రెస్ విడుదల చేసిన రెండో జాబితాలోనూ పొన్నాల లక్ష్మయ్యకు చోటు దక్కక పోవడంపై స్థానిక కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. మాజీ పిసిసి అధ్యక్షుడిని ఇలా అవమానిస్తారా అని నిలదీస్తున్నారు. జనగామ ప్రాంతం బిడ్డ, మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉండి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేసిన టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు రెండో జాబితాలో టికెట్ రాకపోవడంతో ఈ ప్రాంతం అగ్నిగుండంగా మారుతుందని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. వెంటనే జనగామపై స్పష్టత ఇవ్వాలన్నారు. జనగామ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్థానిక నేతలు సమావేశమై తాజా పరిస్తితిని చర్చించారు. సీనియర్ బీసీ నేతగా ఉన్న పొన్నాలకు పార్టీ అధిష్ఠానం టికెట్ విషయంలో ఇబ్బందులు సృష్టించడం సమంజసం కాదన్నారు. అధిష్ఠానం రెండో జాబితాలో పొన్నాలకు టికెట్ ఖరారు చేసి పొన్నాల గౌరవం ఇనుమడింపచేస్తుందని అనుకున్నామని అన్నారు. అయితే రెండో జాబితాలోనూ మొండి చేయిచూపడం దేనికి సంకేతమన్నారు. పొన్నాలకు టికెట్ రాకుంటే నియోజకవర్గంలో కాంగ్రెస్
అగ్రనేతలతో పాటు మహాకూటమి నాయకులు ప్రచారంలో తిరగలేరన్నారు. నియోజకవర్గాన్ని అగ్నిగుండంగా మార్చి ఉద్యమిస్తామన్నారు.