రెండో టెస్టులో విజయం దిశగా కివీస్
కొలంబో ,నవంబర్ 28 శ్రీలంకతో జరుగుతోన్న రెండో టెస్టులో న్యూజిలాండ్ విజయం దిశగా సాగుతోంది. లంక ముందు భారీ లక్ష్యాన్ని నిర్థేశించడంతో పాటు వారి టాపార్డర్‌ను కుప్పకూల్చి మ్యాచ్‌లో పట్టుబిగించింది. 6 వికెట్లకు 225 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో ఇవాళ తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక కాసేపటికే ఆలౌటైంది. హాఫ్ సెంచరీతో జట్టును ఫాలో ఆన్ గండం నుండి గట్టెక్కించిన సమరవీరా 76 పరుగులకు ఔటవగా…. రణ్‌దీవ్ 39 పరుగులకు వెనుదిరిగాడు. తర్వాత టెయిలెండర్లు ఔటయ్యేందుకు ఎంతో సమయం పట్టలేదు. దీంతో లంక తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బౌలర్లలో సౌథీ 5 , బౌల్ట్ 4 వికెట్లు తీసుకున్నారు. దీంతో న్యూజిలాండ్‌కు 169 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. వెంటనే రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆ జట్టు భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచే ఉధ్ధేశంతో వేగంగా ఆడి వికెట్లు కోల్పోయింది. కేవలం 75 పరుగులకే సగం వికెట్లు చేజార్చుకున్న దశలో టేలర్ , ఆస్ట్‌లే జట్టును ఆదుకున్నారు. ఆరో వికెట్‌కు 97 పరుగులు జోడించారు. వీరిద్దరూ ఔటయ్యాక… మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. దీంతో న్యూజిలాండ్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 9 వికెట్లకు 194 పరుగుల దగ్గర డిక్లేర్ చేసింది. లంక బౌలర్లలో హెరాత్ 3 , రణ్‌దీవ్ 2 , కులశేఖర 2 వికెట్లు తీసుకున్నారు. 363 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఆది నుండే తడబడింది. కేవలం 46 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ పరన్‌వితన డకౌటవగా… దిల్షాన్ 14 , సంగక్కరా 16 , జయవర్థనే 5 పరుగులకు పెవిలియన్ చేరుకున్నారు. ఈ దశలో వెలుతురు మందగించడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. ఆట ముగిసే సమయానికి శ్రీలంక 4 వికెట్లకు 47 పరుగులు చేసింది. సమరవీరా , మాథ్యూస్ క్రీజులో ఉన్నారు. చేతిలో ఆరు వికెట్లున్న లంక విజయం కోసం ఇంకా 316 పరుగులు చేయాల్సి ఉంది. పిచ్ బౌలర్లకు అనుకూలిస్తోన్న నేపథ్యంలో ఆఖరిరోజు కివీస్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.