రెండో రోజూ హైదరాబాద్‌లో కుండపోత…

 హైదరాబాద్‌ : నగరాన్ని భారీ వర్షం వణికిస్తోంది. మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకూ ఏకధాటిగా కురిసిన వర్షానికి భాగ్యనగరం తడిసిముద్దయిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం కాస్తా తెరపి ఇచ్చినా.. సాయంత్రానికి మళ్లీ భారీ వర్షం మొదలైంది. నగరంలోని పలు ప్రాంతాలలో వాన దంచి కొడుతోంది. ముషిరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు, చిక్కడపల్లి, హిమాయత్‌నగర్‌, అబిడ్స్‌, కోఠీ, దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, కొత్తపేట, సరూర్‌నగర్‌, మీర్‌పేట్‌, వనస్థలిపురం, ఎల్బీనగర​లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.  భారీ వర్షం కురుస్తుండటంతో ఉద్యోగులు ఇళ్లకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.