రెండో విడత ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు

సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు

కొత్తగూడెం,జనవరి24(జ‌నంసాక్షి): జిల్లాలో రెండో విడత ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జేసీ కర్నాటి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. శుక్రవారం జరిగే పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అధికారులకు అందించే ఎన్నికల సామగ్రి కేంద్రం వద్ద సదుపాయాలపై అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల నిర్వహణకు పోలింగ్‌ బూత్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. పోలింగ్‌ కేంద్రాలలో నీరు, విద్యుత్‌ పాటు మరుగుదొడ్లు సదుపాయాలు పూర్తిస్థాయిలో కల్పించామని తెలిపారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని మండల అధికారులను ఆదేశించారు. పంచాయతీల్లో ఎన్నికల కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కొరత లేకుండా చూడాలన్నారు. పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులతో కలిసి అన్నిరకాల ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ సునీల్‌దత్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు చర్యలు చేపట్టాలని అధికారులు, సిబ్బందిని కోరారు. ప్రజలు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు నిర్భయంగా ముందడుగు వేయాలన్నారు. ప్రజలను ప్రలోభాలకు గురి చేసే నాయకులు, కార్యకర్తలపై ప్రత్యేక దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ పోలింగ్‌ స్టేషన్‌లో భద్రత ఏర్పాట్లను కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు. పోలీస్‌, రెవెన్యూ శాఖ అధికారుల సమన్వయంతో ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. రెండో దఫాలో మొత్తం 142 పంచాయతీలకు వార్డులతో సహా 17 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నిక జరిగిందని, మొత్తం 1294 పంచాయతీల్లో 289 వార్డులు ఏకగ్రీవమయ్యాయని తెలిపారు. 142 పంచాయతీలతో 17 పంచాయతీలు మావోయిస్టు ప్రభావిత పంచాయతీలుగా, 10 పంచాయతీలను సమస్యాత్మక, 115 పంచాయతీలు సాధారణ పంచాయతీలుగా గుర్తించినట్లు తెలిపారు.