రెవెన్యూ అధికారుల బిజీ

చెక్కులు, పాస్‌ పుస్తకాల పరిశీలన
ఆదిలాబాద్‌,మే3(జ‌నం సాక్షి): జిల్లాలో రైతుబంధు చెక్కులతో పాటు కొత్త పట్టా పాస్‌ పుస్తకాల పంపిణీ పక్రియ వేగంగా సాగుతోంది. దీంతో అధికారులు, కిందిస్థాయి ఉద్యోగులు ఈ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఇతర పనుల సంగతెలా ఉన్నా చెక్కులు,పట్టాదారు పాస్‌ పుస్తకాల పంపిణా కార్యక్రమాలతో అధికారులు బిజీగా ఉన్నారు.  ఈ నెల నుంచి చెక్కులతో పాటు పాసు బుక్కులను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రెవెన్యూ గ్రామాల వారీగా
రైతులకు సంబంధించిన ఖాతా నంబర్లు, సర్వే నంబర్లు, భూమి విస్తీర్ణాన్ని పరిశీలిస్తున్నారు. సర్వేలో వివరాలు పట్టాపాసు పుస్తకాల్లో సరిగా ఉన్నాయా లేదా అని చూస్తున్నారు. వివిధ మండలాల్లో పంటలు సాగుచేస్తున్న రైతులకు వారికి ఉన్న భూమి ప్రకారం ఎకరాకు రూ.4 వేల వచ్చాయా లేదా చెక్కుల పట్టాదారు పేరు, ఇతర వివరాలు సరిగా ఉన్నాయా లేదా అనే విషయాలను పరిశీలిస్తున్నారు. భూ సమగ్ర సర్వేలో భాగంగా క్షేత్రస్థాయిలో సేకరించిన వివరాలను పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాత పట్టా పాసు పుస్తకాలు, రైతుబంధు చెక్కులను పంపిణీ చేస్తారు. జిల్లాలోని 18 మండలాలకు చెందిన తహసీల్దార్లు, నాయబ్‌ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లతో పాటు వ్యవసాయశాఖ ఏవోలు, వ్యవసాయ విస్తరణ అధికారులు సైతం పట్టాపాసు పుస్తకాలు, చెక్కుల పరిశీలనలో పాల్గొన్నారు.  చెక్కులు వారం రోజుల కిందట జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. జిల్లాలో 1,16,928 మంది రైతులకు 1,11,500 పట్టా పాసు పుస్తకాలు అవసరం కాగా ఇప్పటి వరకు 83,500 వేల పాసు పుస్తకాలు జిల్లా కేంద్రానికి వచ్చేశాయి. భూ సమగ్ర సర్వేలో భాగంగా గ్రామాల్లోని భూముల వివరాలను పకడ్బందీగా సేకరించిన రెవెన్యూ అధికారులు ఇందుకు సంబంధించిన వివరాలను కంప్యూటర్‌లో పొందుపర్చి పట్టా పాసుపుస్తకాల ముద్రణ కోసం ఉన్నతాధికారులకు పంపించారు. జిల్లా అధికారులు, సిబ్బంది సేకరించిన వివరాల ప్రకారం పాసు పుస్తకాల ముద్రణ జరగగా జిల్లాకి వచ్చిన పట్టా పాసుపుస్తకాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
—–

తాజావార్తలు