‘రెవెన్యూ’ సమస్యల పరిష్కారానికి కృషి

నల్గొండ, అక్టోబర్‌ 9 : డయల్‌ యువర్‌ జెసి కార్యక్రమం ద్వారా రెవెన్యూకు సంబంధించిన అంశాలను పరిష్కరిస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ వివరించారు. మంగళవారం నాడు జాయింట్‌ కలెక్టర్‌ ఉదయం 10గంటల నుంచి 11గంటల వరకు తన ఛాంబర్‌ నుంచి ఫిర్యాదు దారులతో డయల్‌ యువర్‌ జెసి కార్యక్రమం ద్వారా ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, డయల్‌ యువర్‌ జెసి కార్యక్రమం ద్వారా వచ్చే ఫిర్యాదులను తక్షణ పరిష్కారం కొరకు సంబంధిత రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. భూమికి సంబంధించిన వివరాలు, మ్యూటేషన్స్‌, పహనీలలో మార్పులు, చేర్పులను, కొన్నవారి, అమ్మిన వారి వివరాలను పారదర్శకంగా రూపొందించి ఫిర్యాదు దారులకు అందజేయాలని ఆదేశించారు. గ్రామాలలో బాటలు, డొంకలకు సంబంధించిన సమస్యలను కోర్టు పరిధిలోనే పరిష్కరించుకోవాలని సూచించారు. సూర్యాపేట మార్కెట్‌ యార్డులో పెసర్లకు కనీసపు మద్దతు ధర చెల్లించడం లేదని రైతు ఫిర్యాదుపై తక్షణం స్పందిస్తూ విచారణ చేయాలని పౌర సరఫరాల అధికారులను ఆదేశించారు. ఈ డయల్‌ యువర్‌ జెసి కార్యక్రమం ద్వారా దాదాపు 11 ఫిర్యాదుల స్వీకరించి, ఆయా సమస్యల పరిష్కారానికి తగు చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి హన్మంతరెడ్డి, స్పెషల్‌ కలెక్టర్‌ ప్రసాదరావు, సూపరింటెండెంట్‌ చంద్రవదన తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు