రేణుక వ్యాఖ్యలపై మండిపడ్డ కోదండరామ్ బొత్సకు ఫిర్యాదు
బేషరతుగా క్షమాపణలకు టీ జేఏసీ డిమాండ్
హైదరాబాద్, ఏప్రిల్ 2 (జనంసాక్షి) :
తెలంగాణ ఆత్మబలిదానాలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి చేసిన తీవ్ర వ్యాఖ్యలపై తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమాన్ని కించపరుస్తూ ఆమె చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మంగళవారం జెఎసి నేతలతో కలిసి ఆయన పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ దృష్టికి రేణుక వ్యాఖ్యలను తీసుకెళ్లారు. ఆమె వ్యాఖ్యలపట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడా రు. రేణుక ఢిల్లీలో ఉంటూ సీమాంధ్రకు ప్రతినిధిగా వ్యవహ రిస్తున్నారని ఆరోపించారు. రేణుకా చౌదరీపై పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఆమె వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల డీసీసీల నేతలకు జిల్లా జెఎసిలు వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించామని ఆయన పేర్కొన్నారు. బేషరతుగా ఆమె తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేణుకకు తెలంగాణలో తగిన గుణపాఠం చెబుతామని జెఎసి నేత శ్రీనివాసగౌడ్ హెచ్చరించారు. తెలంగాణ అమరవీరుల బలిదానాలను చులకన చేస్తూ మాట్లాడిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి రేణుకా చైదరి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే రేణుక అహంకారపూరితంగా తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా బుధవారం జరగాల్సిన తెలంగాణ రాజకీయ జెఎసి విస్తృత సమావేశాన్ని గురువారంనాటికి వాయిదా వేస్తోన్నామని కోదండరాం ప్రకటించారు. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల సమావేశాన్ని వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిపారు.