రేవంత్.. దమ్ముంటే ఆరోపణలు రుజువు చేయ్!
-లేదంటే పరువు నష్టం దావా వేస్తా
-హరీష్ ఫైర్
హైదరాబాద్, జనవరి30,జనంసాక్షి: ఇసుక మాఫియా పేరుతో ఆరోపణలు చేసిన టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిపై మంత్రి హరీష్‌రావ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇసుక మాఫియాతో తనకు సంబంధం ఉందని రేవంత్ చేసిన ఆరోపణలు అవాస్తవాలని చెప్పారు. దమ్ముంటే రుజువు చేయాలని లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు. 24 గంటల్లో నిరూపించాలని లేదంటే పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు. ప్రతిస్ట దెబ్బతీసే విధంగా రేవంత్ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. గతంలో కూడా పసలేని ఆరోపణలు చేసిన రేవంత్ ప్రజల్లో నవ్వుల పాలయ్యారని అన్నారు. ఇసుక తవ్వకాల్లో కేసీఆర్ కుటుంబీకుల హస్తం ఉందని టిడిపి నేత రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే బిజెపి నేత కిషన్ రెడ్డి కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. అయితే ఆయన పేర్లు పెట్టకుండా కేవలం టిఆర్‌ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. ఇదిలావుంటే టిడిపి నేత మోత్కుపల్లి, మంత్రి కడియం శ్రీహరి మధ్య విమర్శలు చెలరేగుతూనే ఉన్నాయి. మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలకు కడియం కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. శుక్రవారం మోత్కుపల్లి విూడియాతో మాట్లాడారు. 20 సంవత్సరాలుగా కులాన్ని దాచి ఎస్సీలకు కడియం శ్రీహరి అన్యాయం చేశాడని మరోమారు విమర్శించారు. బైండ్ల కులానికి చెందిన వ్యక్తిగా ఇవాళ బయటపెట్టిన కడియం శ్రీహరి ఇన్నాళ్లుగా తాను ఎస్సీనని ఎందుకు చెప్పుకున్నారని ప్రశ్నించారు. ఎస్సీలకు ఇచ్చే రిజర్వేషన్‌ను అమలు కాకుండా కడియం శ్రీహరి అడ్డుకున్నారని మోత్కుపల్లి అన్నారు.