రేవంత్‌-మోడీల మధ్య లోపాయికారి ఒప్పందం

` తెలంగాణకు ద్రోహం ఖాయంగా కనిపిస్తోంది
` యూరియా సంక్షోభానికి కాంగ్రెస్‌ పాలనే కారణం
` బీజేపీ, కాంగ్రెస్‌లు ‘దొందూ దొందే’
` స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పాలి : కేటీఆర్‌
హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోకుండా, తెలంగాణకు ద్రోహం చేయడంలో మాత్రం కలిసి పనిచేస్తున్నాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోడీల మధ్య అంతర్గత ఒప్పందం ఉందని, దానివల్ల తెలంగాణ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆయన తీవ్రంగా విమర్శించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీలో బిజెపి సినీయర్‌ నాయకులు అలూరి విజయభారతి, పలువురు బిజెపినేతలు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన చేరికల కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి తదితర సీనియర్‌ నాయకులతో కలిసి ప్రసంగిస్తూ కేటీఆర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘రేవంత్‌ రెడ్డి జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నారు. గతంలో మా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కట్టిన భవనాలను రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించడానికి తాపత్రయ పడుతున్నారు. ఆ కత్తెర పట్టుకుని జాగ్రత్తగా తిరగండి,’’ అంటూ ఆయన సెటైర్‌ వేశారు. ఈ రోజు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళ్లిన రేవంత్‌ రెడ్డి, గతంలో కేసీఆర్‌ గారు పునాది వేసిన భవనాలను ప్రారంభించి వచ్చారని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. రేవంత్‌ రెడ్డి మాట్లాడుతున్న ‘వికృతమైన’ మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని, గత ముఖ్యమంత్రులతో పోల్చి చూసి రేవంత్‌ను బండ బూతులు తిడుతున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు చేయకపోవడాన్ని తీవ్రంగా విమర్శించిన కేటీఆర్‌, ‘‘గోదావరి నీళ్లను దిగువకు పంపి చంద్రబాబు కడుతున్న కనకచెర్ల ప్రాజెక్టుకు, అక్కడి నుంచి తమిళనాడుకు తరలించేందుకు రేవంత్‌ కుట్ర చేస్తున్నాడు. ఇది మోడీ, చంద్రబాబు ఆదేశాల మేరకే జరుగుతోంది’’ అన్నారు. మోడీ, చంద్రబాబు ఆదేశాల మేరకే రేవంత్‌ రెడ్డి గోదావరి నీళ్లను కిందికి పంపించేందుకు కుట్ర చేస్తున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. ‘‘కాళేశ్వరం నీళ్లు ఆగకుండా, గోదావరి నీళ్లు కిందికి వెళ్లి చంద్రబాబు కడుతున్న కనకచెర్ల ప్రాజెక్టుకు, అక్కడి నుంచి తమిళనాడుకు వెళ్లాలనేది కేంద్రంలోని బీజేపీ, రేవంత్‌కు ఇచ్చిన ఆదేశం. అందుకే రేవంత్‌ కాళేశ్వరం ప్రాజెక్టుపై పగ పట్టారు,’’ అని కేటీఆర్‌ స్పష్టంగా చెప్పారు. రాష్ట్రంలో యూరియా కొరత ఒకవైపు ఉంటే, రేవంత్‌ రెడ్డి మరోవైపు సినిమా వాళ్ళతో సమావేశాలు పెట్టుకున్నారని కేటీఆర్‌ విమర్శించారు. ‘‘యూరియా కొరతకు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ కారణమని బీజేపీ ఎంపీలు చెబుతున్నారు. అందుకే చైనా నుంచి ఎరువులు రాలేదని అంటున్నారట. అసలు మనకు చైనాతో యుద్ధం జరిగిందా? రేవంత్‌పై మాట పడకుండా బీజేపీ కాపాడుతోంది,’’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు.‘బడా మోడీ, చోటా మోడీ’ల దొంగాట: రాహుల్‌కు దెబ్బ ఖాయంకేటీఆర్‌ మాట్లాడుతూ, రేవంత్‌ రెడ్డి, నరేంద్ర మోడీల మధ్య అనేక పోలికలు ఉన్నాయని, ఇద్దరూ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. ‘‘ఒకరు బడా మోడీ, మరొకరు చోటా మోడీ. ఇద్దరూ కలిసి పని చేస్తున్నారు. రేవంత్‌ రెడ్డి వ్యవహార శైలి చూస్తుంటే, ఆయన రేపో మాపో మోడీతో కలిసిపోవడం ఖాయం అనిపిస్తోంది. దీనివల్ల కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీకే పెద్ద దెబ్బ తగులుతుంది,’’ అని కేటీఆర్‌ విశ్లేషించారు. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీలు దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లుగా ఎనిమిది చొప్పున ఎంపీ స్థానాలను పంచుకున్నారని ఆయన ఆరోపించారు. రేవంత్‌ రెడ్డి హామీల వైఫల్యాలపై బీజేపీ ఎంపీలు ఏనాడు ప్రశ్నించడం లేదని, కానీ రేవంత్‌కు రక్షణగా కేసీఆర్‌ గారిపై మాత్రం విమర్శలు చేస్తున్నారని కేటీఆర్‌ దుయ్యబట్టారు. అమృత్‌ స్కాం, హెచ్‌సీయూ భూముల స్కామ్‌లపై ఆధారాలతో ఫిర్యాదు చేసినా కేంద్రం చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.తెలంగాణకు ద్రోహం చేయడంలో బీజేపీ, కాంగ్రెస్‌లు రెండూ ఒకటేనని కేటీఆర్‌ అన్నారు. పరిశ్రమలు, పెట్టుబడులు, విభజన హామీలు – అన్నింటిలోనూ బీజేపీ తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని పేర్కొన్నారు. లక్షల ఉద్యోగాలు కల్పించే ఐటీఐఆర్‌ ప్రాజెక్టును బీజేపీ రద్దు చేసిందని, హైదరాబాద్‌లోని డిఫెన్స్‌ కారిడార్‌ను కాదని బుందేల్‌ఖండ్‌కు తరలించిందని ఆరోపించారు. కేన్స్‌, మైక్రాన్‌ వంటి సంస్థల రూ. 10 వేల కోట్లకు పైగా పెట్టుబడులను కూడా గుజరాత్‌కు తరలించారని ఆయన వివరించారు. పారిశ్రామిక రంగంలో అన్యాయం, విద్యా, సాగునీటి రంగాల్లో బిజెపి తీవ్ర మోసం చేసిందన్నారు. తెలంగాణకు ఒక్క నవోదయ పాఠశాల, మెడికల్‌ కాలేజీ, ఐఐఎం వంటి విద్యా సంస్థలను కూడా బీజేపీ ఇవ్వలేదని కేటీఆర్‌ గుర్తు చేశారు. అలాగే, పసుపు బోర్డును చిన్న రూమ్‌కు పరిమితం చేసిందని, కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు జాతీయ హోదా ఇవ్వలేదని అన్నారు. ‘‘గత పదేళ్లలో కేసీఆర్‌ చేసిన పాలనను ప్రజలు మర్చిపోయారు. అందుకే ఇప్పుడు యూరియా వంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్‌ చెప్పిన అబద్ధాలు నమ్మి మోసపోవద్దని మేము ఆరోజు విజ్ఞప్తి చేశాం,’’ అని కేటీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో చెప్పిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా అందరినీ మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఈ 20 నెలల కాంగ్రెస్‌ పాలన నచ్చకుంటే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసి ప్రజలు తమ తీర్పు ఇవ్వాలని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.