రైతన్నను పట్టించుకోని సర్కార్
ఆదిలాబాద్,డిసెంబర్20(జనంసాక్షి): మోడీ తరహా ఆర్థిక సంస్కరణలు ప్రజలపై, వ్యవసాయ మార్కెట్లపై తీవ్రమైన దుష్పభ్రావం పడిందని సిపిఐ జిల్లా కార్యదర్శి కలవేన శంకర్ అన్నారు. ఏడాది కావస్తున్నా ఇంకా సమస్య తీరడం లేదన్నారు. వెనకబడిన ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడి వ్యవసాయానికి దూరంగా ఉండాల్సిన దుస్థితి కల్పించారని మండిపడ్డారు. పంటల కొనుగోళ్లు నిలిచిపోయాయన్నారు. రైతు సంతోషంగా ఉంటే సమాజం బాగుంటుందని, దీనికి విరుద్ధంగా దేశంలో అడుగడుగునా రైతులకు అన్యాయం జరుగుతోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రకృతితి పోరాడి ముందుకు సాగుతున్న దశలో ఇప్పుడు కేంద్రం వైఖరి కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని అన్నారు. రైతాంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఎన్నో పోరాటాలు చేసినా ప్రభుత్వాల్లో చలనం లేదన్నారు. రైతుల ఆత్మహత్యలు నివారిస్తామని, స్వామినాథన్ కమిషన్ సూచనల ప్రకారం పంటలకయ్యే ఖర్చుకు 50శాతం కలిపి మద్దతు ధర నిర్ణయించి అమలు చేస్తామని ఎన్నికల కంటే ముందు వాగ్దానాలు చేసిన భాజపా, పీఠం ఎక్కాక వాగ్దానాలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందన్నారు. ప్రభుత్వాల తీరు కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, రైతులకు తీరని నష్టం జరుగుతోందని అన్నారు. కనీసంగా ప్రత్యమ్నాయ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. మార్కెట్లో కొనుగోళ్లు జరగడం లేదన్నారు. జరిగినా చేతికి డబ్బులు రావడం లేదన్నారు. వివిధ రకాల పంటలను ఆయా మార్కెట్లకు తీసుకుని వెల్లడం కూడా రైతులకు కష్టంగా మారిందన్నారు. ఇదిలావుంటే వరంగల్ ఎనుమాముల, జమ్మికుంట మార్కెట్‌లో పత్తి ధరలు పెరిగాయి. తక్కువ ఉత్పత్తులు విక్రయాలకు రావటం, వ్యాపారులు కొనుగోళ్లకు పోటీ పడటంతో విడిపత్తి ధరలు పెరిగాయి. విడిపత్తిని రైతులు విక్రయాలకు తీసుకువచ్చారు. విడిపత్తికి నిర్వహించిన బిడ్డింగ్‌లో క్వింటాల్‌కు రూ.5,200ల అత్యధిక ధర పలికింది. బస్తాల పత్తికి ముందుగా బిడ్డింగ్‌ను నిర్వహించగా క్వింటాల్‌కు రూ.5,030ల ధర పలికింది. అయితే విడిపత్తి బిడ్డింగ్‌లో ధరలు క్రమేణా పెరిగాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో కూడా ధరలు పెరగడానికి కారణమని వ్యాపార వర్గాలు అంటున్నాయి పత్తికి క్వింటాల్‌కు రూ.100ల ధర ఎక్కువ లభించింది. ఈయేడు పంటలు తగ్గించి వేశారని అన్నారు. అందుకే ధరల్లో మార్పు వచ్చిందన్నారు.యాసంగికి పెట్టుబడులు లేక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు.