రైతుబంధుతో కెసిఆర్‌ చరిత్ర: ఎమ్మెల్యే

యాదాద్రి,మే4(జ‌నం సాక్షి ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన  రైతుబంధు పథకం దేశానికే ఆదర్శం కానుందని ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు.  ఏడాదికి ఎకరాకు రూ.8 వేల చొప్పున రైతుకు పంట సాయం అందిస్తున్న ఘనత కేవలం సిఎం కెసిఆర్దే నని అన్నారు. విమర్శలు చేస్తున్న కాంగ్రెస్‌, బిజెపిలు తమ పాలిత రాస్ట్రాల్లో అమలు చేయాలని సవాల్‌ చేశారు. వ్యవసాయం దండుగన్నోళ్లకు  కళ్లు తెరిపించేలా కార్యక్రమాలను చేసి చూపిస్తున్న నేత కెసిఆర్‌ అని అన్నారు. దశాబ్దాలుగా రాష్ట్రాన్ని పాలించిన వారికి రైతులను ఆదుకోవాలన్న ధ్యాసలేదని అన్నారు.  పండించిన పంటకు మద్దతుధర ఇవ్వాలన్న ఆలోచన చేయలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక అడ్డుకుంటూ రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్‌  తీరుపై ధ్వజమెత్తారు. రైతులు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. మే 10 నుంచి 17 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో 
చెక్కులు, పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల పంపిణీ జరుగుతుందని అన్నారు.  ఇందులో అధికారులు, ప్రజాప్రతినిధులంతా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా కార్యక్రమం రూపొందించారని ఎమ్మెల్యే అన్నారు.