రైతుబంధు పథకంపై విమర్శలా

కాంగ్రెస్‌ నేతలకు నిద్ర పట్టడం లేదు:మంత్రి తుమ్మల 
ఖమ్మం,మే11(జ‌నం సాక్షి): రైతుబంధు చెక్కుల పంపిణీ, పాస్‌పుస్తాకల అందచేత రాష్ట్రంతో పాటు ఖమ్మం జిల్లాలో బ్రహ్మాండంగా జరిగిందని, రైతులతో పాటు ప్రజలు కూడా ఈ పథకం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతులు అనేకమంది స్వయంగా కలిసి తమకు వ్యవసాయంపై భరోసా పెరిగిందని, సిఎం కెసిఆర్‌ పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని శుక్రవారం నాడిక్కడ అన్నారు. అయితే ఈ పథకం పట్ల కుళ్లుకుంటున్నది ఒక్క కాంగ్రెస్‌ నేతలు మాత్రమేనని అన్నారు.
రైతుపక్షపాతిగా ముద్రపడిన తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఉత్తమ్‌కుమార్‌ ఉత్తుత్తి ప్రగల్భాలు మానుకుని రైతులకుఅ ండగా నిలవాలని లేకుంటే వారి ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. దేశ చరిత్రలో రైతు ఆనందపడే ఘట్టం గతంలో ఎప్పుడూ కానరాలేదన్నారు. రైతుబందజు పథకంతో ఇది మొదలయ్యిందన్నారు. తెలంగాణలో కెసిఆర్‌ చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయితే ఇక వ్యవసాయం రంగంలో విప్లవం రానుందన్నారు.  అభివృద్ధిని చూసి ఓర్వలేని, అక్రమాలకు అలవాటుపడిన కాంగ్రెస్‌ నాయకులు పచ్చ కామెర్ల మాటలు మానుకోవాలంటూ హితవు పలికారు. రూ.200ఖర్చుతో 20 అంశాలతో కూడిన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కొత్త పాస్‌ పుస్తకాలను ఎక్కడా అక్రమాలకు తావివ్వకుండా ఇతర రాష్ట్రాల్లో తయారుచేయించామన్నారు. అయినా అందులోనూ అక్రమాలు జరిగాయని కాంగ్రెస్‌ వారు అంటే వారిని ఏమనాలో అర్థం కావడం లేదన్నారు. ఇదిలావుంటే శనివారం జిల్లాలో  ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖమంత్రి మహమూద్‌ అలీ, వ్యవసాయ శాఖమంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి హాజరై చెక్కులు, పాస్‌ పుస్తకాలను అందజేస్తారన్నారు.
—–