రైతులకు రుణాలు ఇవ్వండి

యువతకు చేదోడుగా నిలవండి
బ్యాంకర్లకు సీఎం ఆదేశం
హైదరాబాద్‌, జూన్‌ 4 (జనంసాక్షి) :
రైతులకు రుణాలివ్వాలని, యువతకు చేదోడుగా నిలువాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బ్యాంకర్లను ఆదేశించారు.  2013-14 సంవత్సరం వార్షిక రుణ ప్రణాళిక 1,33,73, 000 కోట్ల రూపాయలుగా బ్యాంకర్ల సమావేశంలో ప్రకటించారు. మంగళవారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన క్షేత్రస్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రుల రఘువీరా రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, సునీతా లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ వచ్చే ఏడాది రైతులకు అత్యధికంగా రుణాలిచ్చేందుకు బ్యాంకు అధికారులు సహకరించాలని కోరారు. ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో అమలు జరిగేందుకు బ్యాంకర్లు సహకరించాలని ఆయన కోరారు. ప్రభుత్వం వడ్డీలేని రుణాలు అందించేందుకు కృతనిశ్చయంతో ఉందని అన్నారు. అయితే కొన్ని బ్యాంకులు రుణాలపై వడ్డీలు వసూలు చేసేందుకు రైతులపై ఒత్తిళ్లు తెస్తున్నాయని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని అన్నారు. రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకుగాను, రుణాల మంజూరులో, చెల్లింపుల్లో తలెత్తుతున్న ఇబ్బందులను తొలగించేందుకు రైతులు నేరుగా బ్యాంకులతో చర్చించేందుకుగాను టోల్‌ఫ్రీ నంబరును అందుబాటులో ఉంచినట్టు ఆయన తెలిపారు. దీని ద్వారానే కొన్ని బ్యాంకులు రుణాలపై వడ్డీలను వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయన్నారు. బ్యాంకర్లు ఒత్తిళ్లు తెచ్చినా వడ్డీలు చెల్లించొద్దని రైతులకు సూచించారు. రుణాల లక్ష్యాన్ని గతేడాది కన్నా వచ్చే ఏడాది మరింత ఎక్కువగా ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని బ్యాంకర్లకు సూచించారు. యువత స్వయం ఉపాధికి రుణాలు ఇవ్వాలని  కోరారు. తాజ్‌కృష్ణాలో   ఆరులక్షల మంది యువతకు స్వయం ఉపాధి నిమిత్తం 2వేల కోట్ల రూపాయలను రుణాలు అందించి సహకరించాలని కోరారు. బ్యాంకులు సహకరిస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. అర్హత కార్డు ఉన్న రైతులకు కూడా రుణాలు ఇవ్వాలని సూచించారు. ఇన్‌పుట్‌ సబ్సిడీని రుణాల కింద జమ కట్టుకోవద్దని బ్యాంకర్లకు సూచించారు. దాంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పంట చేతికందగానే రుణాలను తీర్చేస్తారన్నారు. అప్పటివరకు ఓపిక పట్టాలని బ్యాంకర్లకు సూచించారు. ఖాతాలు తెరిచేందుకు రైతులకు సహకరించాలని కోరారు.  లక్ష రూపాయలలోపు రుణాలు చెల్లించే రైతుల నుంచి ఎంత వసూలు చేస్తున్నారో రశీదుల రూపంలో రైతులకు వివరించాలన్నారు. నాన్‌ ట్రైబల్స్‌ రుణాల విషయంలో తలెత్తే సమస్యలను పరిష్కరించాలని కోరారు. నాన్‌ ట్రైబల్స్‌ రుణాల్లో దళారీల బెడదను తొలగించేందుకే ఈసేవా ద్వారా వివిధ సేవలు అందిస్తున్నట్టు సీఎం తెలిపారు. ఇందులో తలెత్తిన సమస్యలను బ్యాంకర్లు పరిష్కరించాలని ముఖ్యమంత్రి కోరారు. రుణాల రీషెడ్యూలుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చిందని, దానికి అనుగుణంగా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.