రైతులను భాగస్వాములను చేసేలా హరితహారం

మంత్రి జోగురామన్న సూచనతో అటవీ అధికారుల కార్యాచరణ

ఆదిలాబాద్‌,జూలై6(జ‌నం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణకు హరితహారం అటవీశాఖ మంత్రి జోగురామన్న ఇలాఖా అయిన ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు. గత మూడు విడతల హరితహారంలో అటవీ అధికారులు పెద్ద ఎత్తున మొక్కలు నాటించారు. త్వరలో ప్రారంభం కానున్న నాలుగో విడతలో కూడా దీనిని పెద్ద ఎత్తున చేపట్టేందుకు ప్రణాళిక సిద్దం చేశారు. ప్రధానంగా రైతులను భాగస్వాములను చేసేలా వారిని ప్రోత్సహించబోతున్నారు. ఈ పథకంలో భాగంగా అందరూ మొక్కలు నాటి విజయవంతం చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న ఇప్పటికే ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదిలాబాద్‌ను హరితంలో ముందుంచాలని సూచించారు. ఇందులో భాగంగా హరితహారం నర్సరీలకు సంబంధించిన బుక్‌లెట్‌, సిరుల పంట..మలబారు వేప వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని నర్సరీలు, మొక్కల పెంపకానికి సంబంధించిన వివరాలతో కూడిన బుక్‌లెట్‌ను కూడా ఆవిష్కరించారు. మరోవైపు రైతులను పెద్ద ఎత్తున భాగస్వాములను చేయడం ద్వారా వారికి లాభాలు వచ్చేలా హరితహారంను కూడా నాలుగో విడతలో చేపట్టబోతున్నారు. రైతులు మలబారు వేపను పెంచుకుంటే ఆర్థికంగా లాభాలు వస్తాయని అంటున్నారు. రైతులు తమ పంట పొలాల్లో, గట్లపై పెంచుకునేలా ప్రోత్సహించాలని అటవీ అధికారులు అన్నారు. అన్ని రకాల్లో వేపను పెంచుకోవచ్చన్నారు. ఎకరాకు 450 మొక్కలను పెంచుకునే అవకాశం ఉంటుందన్నారు. ఐదారేళ్లలో 500 కిలోల నుంచి ఒక టన్ను వ రకు కలప దిగుబడి వస్తుందని తెలిపారు. పేపర్‌ మిల్లు, ఫ్లెవుడ్‌ ఇండస్ట్రీ ఫర్నిచర్‌, భవన నిర్మాణ సామగ్రిలో మలబారు వేపను వాడుతారని.. ఈ మొక్కల పెంపకం ఆర్థికంగా ఉపయుక్తంగా ఉంటుందన్నారు. కావాలసిన వారికి ప్రభుత్వం ఉచితంగా వేప మొక్కలను పంపిణీ చేస్తుందన్నారు. ఈ మేరకు మంత్రి జోగురామన్న సూచనలతో అటవీ అధికారులు రైతులను సన్నద్దం చేస్తున్నారు. ఒక్క మొక్కకు గుంతలు తీయడానికి రూ.15, మొక్క నాటడానికి రూ.3, సంరక్షణకు రూ.5చొప్పున ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తుందన్నారు. ఈ విషయంపై అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇదిలావుంటే ఇటీవల సొనాల గ్రామంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. మొదట ఆలయం నుంచి విద్యార్థులు, కమిటీ సభ్యులు, యువకులు పెద్ద ఎత్తున డప్పు మేళాలతో ర్యాలీ నిర్వహించారు. చెట్ల ప్రాముఖ్యతను వివరిస్తూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం ఆలయ ఆవరణలో పండ్లు, నీడనిచ్చే జాతులకు సంబంధించిన 200 లకు పైగా మొక్కలు నాటారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలన్నారు. గ్రామస్తులు తమ ఇండ్ల పరిసరాల్లో, పంట పొలాల్లో, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలన్నారు. ప్రభుత్వం ముందు చూపుతో చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు.

 

తాజావార్తలు