రైతులోకానికి ఇది విప్లవం

చెక్కుల పంపిణీలో ఎంపి నగేశ్‌
ఆదిలాబాద్‌,మే11(జ‌నం సాక్షి ): ఆదిలాబాద్‌ జిల్లా  ఇచ్చోడ మండలంలోని ముఖరా కే గ్రామానికి చెందిన 32 మంది దళితులకు ఇచ్చిన 85 ఎకరాలకుగాను పంట పెట్టుబడితో పట్టా పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. రైతు బంధు పథకం కింద ఎంపీ గొడం నగేశ్‌.. రైతులకు ఎకరానికి రూ. 4000ల చొప్పున చెక్కులు
ఇవ్వడంతోపాటు అందరికి పట్టాదారు పాసుపుస్తకాలను అందజేశారు. రైతు లోకానికి ఇది విప్లవాత్మకమైన పథకమని కొనియాడారు. గతంలో రైతుల వద్ద నుంచే ప్రభుత్వాలు శిస్తులు వసూలు చేసేవని గుర్తుచేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం రైతులకే పంట పెట్టుబడులను అందజేస్తోందని చెప్పారు. ఇకనుంచి రైతులు నిర్భయంగా, ధైర్యంగా వ్యవసాయం చేసుకునేలా భరోసాను ప్రభుత్వం కల్పించిందని అన్నారు.
ఇందుకు మొదటి విడతలో రూ.6 వేల కోట్లు, రెండో విడతలో మరో రూ.6 వేల కోట్లు రైతులకు అందించడం జరుగుతుందన్నారు. భూరికార్డుల ప్రక్షాళన కూడా రాష్ట్రంలో 98 శాతం పూర్తయిందని అన్నారు. ట్యాంపరింగ్‌కు అవకాశం లేకుండా, పకడ్బందీగా పట్టాదారు పాస్‌ పుస్తకాలను తెలంగాణ ప్రభుత్వం ముద్రించి అందిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తాజావార్తలు