రైతుల ఆదాయం రెట్టింపే బీజేపీ లక్ష్యం
– వరితోపాటు 14పంటలకు మద్దతు ధర పెంచాం
– హావిూలు అమలుచేశాం కాబట్టే సుప్రింలో అఫిడవిట్ దాఖలు చేశాం
– విలేకరుల సమావేశంలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ
తిరుమల, జులై6(జనం సాక్షి) : రైతుల ఆదాయం ఐదింతలు చేయడమే బీజేపీ లక్ష్యం అని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం ఆయన తిరుపతిలో మాట్లాడుతూ… మామిడి రైతులను ఆదుకోవడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. షుగర్ ఫ్యాక్టరీ రైతులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. హావిూలు అమలు చేశాము కాబట్టే సుప్రీంకోర్టులో అఫడవిట్ దాఖలు చేశామని, తెలుగు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేస్తే చేయమనండన్నారు. దేశంలోని రైతుల ఆదాయం ఐదు ఇంతలు చేయడమే బీజేపీ లక్ష్యం అని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. రైతుల కోసం ఇన్సూరెన్సు సులభతరం అయ్యేలా ప్రధాని మార్పులు చేశారని తెలిపారు. వరితో పాటు14పంటలకు ఎన్నడూ లేని విధంగా మద్దతు ధర పెంచామని, ఇది మోడీ రైతులకు ఇచ్చిన వరం అని తెలిపారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక సహకార చక్కెర ఫ్యాక్టరీలను మూతవేయడం కామన్ గా మారిందని కన్నా ఎద్దేవా చేశారు. చిత్తూరు డైరీని, చక్కెర ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. చిత్తూరు పాల డైరీని హెరిటెజ్ డైరీ కోసం మూతవేశారని విమర్శించారు. సొంత జిల్లా మామిడి రైతుల గోడు చంద్రబాబుకు కనపడటం లేదా అని కన్నా ప్రశ్నించారు. ఇంకా రాష్ట్రంలోని రైతుల పరిస్థితి ఏమి కనపడుతుందని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఏపీలో అభివృద్ధిని మరిచిన చంద్రబాబు కేవలం మోడీని తిట్టేందుకే ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. మోడీ ప్రధాని అయ్యాక దేశం అన్ని రంగాల్లో ముందుకు
సాగుతుందని, చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోలేక మోడీ వల్లనే అభివృద్ధి కావటం లేదని ప్రజల్లో అసత్యాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు ఒప్పుకోవటం వల్లే కేంద్రం అంగీకరించిందని, మళ్లీ ప్రత్యేక ¬దా అంటూ ప్రజల్లో బీజేపీని దెబ్బతీసేలా చంద్రబాబు కుట్ర చేస్తున్నారని కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.