రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

– జిల్లాలో రూ. 74కోట్లతో 49గోదాంలు ఏర్పాటు చేశాం

– 24గంటల విద్యుత్‌తో రైతుల్లో ఆనందం

– రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి

– మొయినాబాద్‌లో వ్యవసాయమార్కెట్‌ గోదాంను ప్రారంభించిన మంత్రి

రంగారెడ్డి, జనవరి9(జ‌నంసాక్షి ) : రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని, రైతుల కళ్లలో ఆనందం చూసేందుకు ప్రత్యేక ప్రణాళికతో కేసీఆర్‌ ముందుకు సాగుతున్నారని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో మంత్రి మహేందర్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మొయినాబాద్‌లో రూ.3కోట్లతో నిర్మించిన

వ్యవసాయమార్కెట్‌ గోదాంను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతు సంక్షేమం కోసం 24గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నామన్నారు. జిల్లాలో మొత్తం 74 కోట్లతో 49 గోదాములు నిర్మించామని, మరికొన్ని నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. రైతులను అన్ని విధాల ఆదుకొనేందుకు కేసీఆర్‌ అన్ని విధాల కృషి చేస్తున్నారని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా రైతు సమితుల ఏర్పాటుతో పాటు, రైతులకు సాగులో సూచనలు ఇచ్చేందుకు 5వేల ఎకరాలకు ఏఓను నియమిస్తున్నారని తెలిపారు. దీనితో ఖరీఫ్‌, రబీ ప్రారంభంలో పెట్టుబడుల కోసం రైతులు ఇబ్బందులు పడకుండా రెండు కాలాల్లో కలిపి ఎకరానికి 8వేలు నేరుగా బ్యాంకుల్లో వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, వచ్చే ఖరీఫ్‌ నుంచి ఈ డబ్బులు రైతులకు అందించటం జరుగుతుందన్నారు. రైతుల సంక్షేమంతో పాటు అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఇప్పటికే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక పథకాలతో వారి ఆర్థికాభివృద్ధికి కేసీఆర్‌ తోడ్పాటును అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్ష పార్టీలు జీర్ణించుకోలేక పోతున్నాయని, అభివృద్ధిని అడ్డుకొనేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాయ న్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్రంను అన్ని రంగాల్లో అభివృద్ధిపర్చి దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు కేసీఆర్‌ పట్టుదలతో ముందుకు సాగుతున్నారని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెరాస నేతలు, అధికారులు పాల్గొన్నారు.

 

తాజావార్తలు