రైతు ప్రభుత్వం అయితే బంద్‌కు ఎందుకు మద్దతివ్వరు

టిఆర్‌ఎస్‌ తీరుపై మండిపడ్డ సిపిఎం నేత తమ్మినేని
హైదరాబాద్‌,సెప్టెంబర్‌27 (జనంసాక్షి)  : రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న టీఆర్‌ఎస్‌ భారత్‌ బంద్‌కు ఎందుకు మద్దతు ఇవ్వడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. ప్రజలను ఇబ్బంది పెట్టడం బంద్‌ ఉద్దేశం కాదన్నారు. వ్వయసాయ చట్టాలతో కార్పోరేట్‌ కొమ్ముకాసే విధానాలను మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. అన్నదాతలకు అండగా న ఇలవాలన్నదే తమ లక్ష్యమన్నారు. బంద్‌లో భాగంగా ఆయన మాట్లాడుతూ 51 కంపెనీలకు కరోనా వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని…అయినా రెండు కంపెనీలకే ఉత్పత్తి చేసే అవకాశం ఇచ్చారని అన్నారు. ఆరు లక్షల కోట్ల ఆదాయం కోసం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నారని ఆరోపించారు. బస్సులను, రైళ్లను కూడా అమ్మేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు, వ్యవసాయానికి నష్టం చేసే నల్ల చట్టాలు తెచ్చారని… వీటికి వ్యతిరేకంగానే ఈ బంద్‌ చేపడుతున్నట్లు చెప్పారు. ఇది ప్రజల బంద్‌…పార్టీల బంద్‌ కాదని తమ్మినేని స్పష్టం చేశారు. ఇదిలావుంటే మనది వ్యవసాయ దేశమని పాలకులు విస్మరించారని అరుణోదయ
కళాకారిణి విమలక్క పేర్కొన్నారు. రైతుల పోరాటానికి మద్దతు ఇచ్చి అందరూ భాగస్వాములు కావాలన్నారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటం న్యాయమైనదన్నారు. ఫార్మా హబ్‌లకు భూములు ఇచ్చుడు కాదు వ్యవసాయనికి కూడా భూములు ఉండాలన్నారు. రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారో ఆలోచించాలని విమలక్క పేర్కొన్నారు.