రైతు సంక్షేమమే లక్ష్యంగా కెసిఆర్ పథకాలు
పెట్టుబడి పథకంతో లబ్దిపొందిన రైతులు
కాళేశ్వరంతో మారనున్న తెలంగాణ దశ
ప్రచారంలో మధుసూధనాచారి
భూపాలపల్లి,నవంబర్3(జనంసాక్షి): రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బందు పథకాన్ని ప్రవేశపెట్టారని, రైతుబందు పథకం ద్వారా రైతులకు పంట పెట్టుబడికి ఎకరానికి రూ. 4వేల చొప్పున ఏడాదికి రూ. 8వేలను అందజేస్తున్నామని మాజీ స్పీకర్ మధుసూధనాచారి అన్నారు. ఈ నియోజకవర్గంలో కూడా అనేకమందికి లబ్ది చేకూరిందన్నారు. రైతులకు మద్ధతు ధర కల్పిస్తూ వారికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయితే తెలంగాణ కోటి ఎకరాల మాగాణంగా మారుతందని, అలాగే జిల్లా సస్యశామలమవుతుందన్నారు.
ప్రజా సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యమని, రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. రైతును కష్టాల నుంచి గట్టెక్కించడమే కేసీఆర్ సంకల్పమని తెలియజేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజల నుంచి ఆపూర్వ ఆదరణ లభించింది. టీఆర్ఎస్ కార్యకర్తలు స్వాగతం పలికారు. గడప గడపకూ తిరుగుతూ అభివృద్ది, సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు టీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాగానే వృద్దులకు, బీడీ కార్మికులకు రూ.2016 ఆసరా ఫించన్ ఇస్తామన్నారు. పంట పెట్టుబడిని రూ.10వేలకు పెంచుతామన్నారు. నాడు వ్యవసాయం దండగన్న వారు మహకూటమి పేరుతో మరోసారి వంచించేందుకు విూ ముందుకు రాబోతున్నారని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. రానున్న ఎన్నికలలో అవకాశవాదులను నమ్మి మోసపోతామని మధుసూద నాచారి అన్నారు. గ్రామంలోని వీధులన్నీ తిరిగి టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపి తనను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. గత ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో గెలిచిన తాను నాలుగున్నరేళ్లుగా అభివృద్దే ధ్యేయంగా పని చేసినట్లు తెలిపారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేశానన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో సుమారు రూ.2,500కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.