రైతు సమస్యలను పరిష్కరించాలి
గుంటూరు, జూన్ 24: రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలను చేపడుతున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ చెప్పారు. గుంటూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ మొదలైనా ఇంతవరకు రైతులకు ఎరువులు, విత్తనాలు అందజేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నియోజకవర్గ కేంద్రాల్లోని ఆర్డిఓ, ఎమ్మార్వో కార్యాలయాల ఎదుట సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రైతులతో కలిసి పార్టీ నాయకులు ధర్నా నిర్వహిస్తున్నారని తెలిపారు. గత ఏడాది ప్రభుత్వం విత్తనాల కంపెనీలతో లాలూచిపడి విత్తనాల ధరలను పెంచిందని ఆరోపించారు. ధరలు పెంచిన వ్యాపారులు, బ్లాక్ మార్కెట్లో విత్తనాలు విక్రయించి అధిక లాభాలను కూడగట్టుకున్నారన్నారు. ఈ ఏడాది కూడా అదే విధంగా కృత్రిమ కొరతను సృష్టించి బిటి పత్తి విత్తనాలను బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారన్నారు. కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారిన నేపథ్యంలో ప్రభుత్వ అలసత్వ, నిర్లక్ష్య వైఖరికి నిరసనగా పార్టీ పిలుపు మేరకు ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు వ్యవసాయ కూలీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని రాజశేఖర్ పిలుపునిచ్చారు.