రైతు సమస్యలపై అనవసర రాద్దాంతం
నిజామాబాద్,అక్టోబర్17(జనంసాక్షి): ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే ఆర్మూర్ జీవన్ రెడ్డి అన్నారు.తెరాస ప్రభుత్వంతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఇంతకాలం 80 శాతం నిధులను ఆంధ్ర ప్రాంతానికి తరలించడంతో ఇన్నాళ్లు అభివృద్ధి కుంటుపడిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి సాధ్యమైందని చెప్పారు. సీఎం కేసీఆర్ అహర్నిశలు రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. రైతు సంక్షేమం అంటూ బీజేపీ,టిడిపి నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. ధర్నాలు,ఆందోళనలు చేస్తున్న వారు గతంలో ఎందుకు రైతులను విస్మరించారో చెప్పాలన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రైతు రుణాలను మాఫీ చేసిందని వివరించారు. మిషన్ కాకతీయతో ప్రభుత్వం చెరువులు పూడిక తీయించిందని అన్నారు. దీంతోనే ఇవాళ చెరువులు కళకళలాడుతున్నాయని అన్నారు. అనవసర రాద్దాంతం చేయడం మానుకోవాలని హితవు పలికారు. వరి, మొక్క జొన్న పంటలకు గిట్టుబాటు ధరలు ఇప్పించింది తమ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అని తెలిపారు.రైతులకు 9గంటలపాటు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తోన్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని పేర్కొన్నారు. ఇప్పుడు 24గంటల కోసం ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.