రైల్లో వ్యక్తికి గుండెపోటు.. 

– మూడు రోజుల తర్వాత మృతదేహం గుర్తింపు
– రైల్వే సిబ్బంది నిర్లక్ష్యానికి పరాకాష్ట
పాట్నా, మే30(జ‌నం సాక్షి) : రైలు బోగీలోని బాత్రూంలో ఓ వ్యక్తి మరణిస్తే.. 3 రోజుల పాటు ఎవ్వరూ గుర్తించని దారుణమిది. మృతదేహం దాదాపు 72 గంటల పాటు 1500 కి.విూ. రైల్లోనే ప్రయాణించింది. ప్రయాణికులు గానీ, రైల్వే సిబ్బంది గానీ ఎవరూ ఈ విషయాన్ని గుర్తించలేకపోవడం నిర్లక్ష్యానికి పరాకాష్టగా మారింది. పాట్నా-కోటా ఎక్స్‌ప్రెస్‌ రైల్లో ఈ ఘటన విషాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన సంజయ్‌ కుమార్‌.. ఆగ్రాలో ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బయలుదేరారు. మే 24న ఉదయం 6గంటలకు ఆయన పాట్నా-కోటా ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కారు. ఏసీ 3-టైర్‌ కోచ్‌లో కూర్చున్న సంజయ్‌కు ఉదయం 7.30 గంటల సమయంలో ఆయన భార్య ఫోన్‌ చేశారు. ఆమెతో మాట్లాడుతూ.. ఒంట్లో కొంచెం నలతగా ఉందని, వీలైతే ముందే ఎక్కడైనా దిగేస్తానని చెప్పి సంజయ్‌ ఫోన్‌ పెట్టేశారు. ఆ తర్వాత ఆమె ఎన్ని సార్లు ఫోన్‌ చేసినా ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అని వచ్చింది. సంజయ్‌ తన భార్యతో ఫోన్‌ మాట్లాడిన అనంతరం బాత్రూమ్‌కి వెళ్లారు. అక్కడే గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయి మరణించారు. లోపలి నుంచి బాత్రూం గడియ పెట్టుకొని ఉండడంతో ఆయణ్ని ఎవరూ గమనించలేదు. సంజయ్‌ ఆగ్రాకు వెళ్లలేదని తెలుసుకున్న ఆయన భార్య రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరకు సంజయ్‌ తన భార్యతో ఫోన్‌ మాట్లాడిన 72 గంటల తర్వాత బిహార్‌లోని పాట్నా రైల్వే స్టేషన్‌లో పాట్నా-కోటా ఎక్స్‌ప్రెస్‌ రైల్లోని బాత్రూంలో పోలీసులు ఆయన మృతదేహాన్ని గుర్తించారు. ఆయన మృతదేహం ఆ రైల్లో దాదాపు 1500 కి.విూ. దూరం ప్రయాణించింది. రైలు కోటాకు వెళ్లి తిరిగి మళ్లీ పాట్నాకు చేరుకునే వరకూ ఎవరూ గుర్తించలేదు. బాత్రూంలు శుభ్రపరచాల్సిన సిబ్బంది, రైల్వే సెక్యూరిటీ సిబ్బంది ఎవరూ గుర్తించలేదు. సంజయ్‌ భార్య ఫిర్యాదు చేసినప్పటికీ రైల్వే పోలీసులు సరిగా స్పందించలేదని బంధువులు ఆరోపిస్తున్నారు.