రైల్వే ప్రాజెక్టులకు ..
రైల్వే ప్రాజెక్టులకు ..హైదరాబాద్, డిసెంబర్ 8 (జనంసాక్ష్‌ి):
రైల్వే ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో తిరుపతికి వెళ్లే బై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను శనివారంనాడు జెండా ఊపి ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, మంత్రులు దానం నాగేందర్, గీతారెడ్డి, ముఖేష్ గౌడ్, ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్యే జయసుధ, ఎమ్మెల్సీ ఆమోస్, డిప్యూటీ మేయర్ రాజ్‌కుమార్, దక్షిణ మధ్య రైల్వే జిఎం, రైల్వే అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ రైల్వేశాఖ సహాయ మంత్రిగా రాష్ట్రానికే చెందిన కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి నియమితులు కావడం హర్షదాయకమైన విషయమన్నారు. కాజీపేట వ్యాగన్ వర్క్‌షాప్‌నకు త్వరగా పూర్తి చేయాలని కోరారు. అలాగే రాయలసీమలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి యత్నించాలన్నారు. సికింద్రాబాద్-తిరుపతి మధ్య శనివారంనాడు ప్రారంభమైన బైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను వారంలో ఏడు రోజుల పాటు నడిచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు సహకరించాలని కోరారు. కేంద్ర మంత్రి మిగతా 2లో
కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ రైల్వే ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు నష్టం జరిగిన విషయం వాస్తవమేనన్నారు. ముఖ్యమంత్రి సూచించిన వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. రాష్ట్ర అభివృద్ధికి రైల్వే శాఖ ఎంతో తోడ్పడుతోందన్నారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నింటిని వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో పరిష్కరిస్తా నని తెలిపారు. ఆయా ప్రాజెక్టులకు అవసరమైన నిధులను వచ్చే బడ్జెట్‌లో పొందుపరుస్తామని తెలిపారు. ఎంఎంటిఎస్ రెండో దశ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రైల్వేభద్రత, స్టేషన్ల అభివృద్ధి, పరిశుభ్రత తదితరమైన వాటిపై దృష్టి పెడతామన్నారు. ఎమ్మెల్యే జయసుధ మాట్లాడుతూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ మరింత అభివృద్ధికి కేంద్ర మంత్రి సహకరించాలని కోరారు. పాదచారులను దృష్టిలో పెట్టుకుని మరిన్ని ఎస్కలేటర్లు, లిఫ్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. తిరుపతికి కొత్త ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించడం హర్షదాయకమన్నారు. తొలుత ఎంపి అంజన్‌కుమార్ మాట్లాడుతూ నూతన ఎక్స్‌ప్రెస్ వల్ల ప్రయాణీకులకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. తక్కువ సమయంలో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి చేరుకుంటారన్నారు. ఇది ముఖ్యమంత్రి జిల్లా అయిన చిత్తూరు జిల్లా మీదుగా ప్రయాణిస్తుందని చెప్పారు. ఇదిలా ఉండగా సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే నూతన రైలు ప్రతి మంగళ, శనివారాల్లో మాత్రమే రాకపోకలు సాగిస్తుంది. ఆయా రోజుల్లో సాయంత్రం 5.40 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయల్దేరుతుంది. శుక్ర, ఆదివారాల్లో తిరుపతి నుంచి రైలు బయల్దేరుతుంది. ఈ రైలు సికింద్రాబాద్, కాచిగూడ, కర్నూలు, డోన్, గుత్తి, ధర్మవరం, పీలేరు, పాకాల మీదుగా తిరుపతికి చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు.